
డాక్టరు గారు! నేను కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నాను. అతనికి కూడా వివాహం అయింది. పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి మా ఈ బంధం కొనసాగుతోంది.. శారీరకంగా కన్నా మానసికంగా మేము ఎక్కువ దగ్గర అయ్యాము. కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం, నన్ను అంతగా పట్టించుకోకపోవటం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. ఆకలి, నిద్ర బాగా తగ్గిపోయాయి. మనసంతా చికాకుగా, ఏడుపు వస్తుంది. అశాంతితో నరకం అనుభవిస్తున్నాను. అతను నాకు ఏమీ కాడు అని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను! ఆఖరికి ఆత్మహత్మ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను!
– ఒక సోదరి, గుంటూరు
మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు తీవ్రమైన మనోవేదన (డిప్రెషన్)కు లోనయినట్లుగా అర్థం అవుతోంది. జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం సహజం. మీకు మంచి భర్త, పిల్లలు ఉన్నా, ఆ వ్యక్తికి భార్య పిల్లలున్నారని తెలిసి కూడా సంబంధం పెట్టుకున్నారు! ఒక్కొక్కసారి భార్యా భర్తల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి అసంతృప్తికి లోనయినవారు, ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశ ముంటుంది! ఇప్పుడా వ్యక్తి తన భార్యను, మిమ్మల్ని కాదని ఇంకా మూడోవ్యక్తితో, కొత్తగా రిలేషన్ షిప్ పెట్టుకున్నాడంటే అతని వ్యక్తిత్వమేంటో మీకీపాటికి తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా మించియిందేం లేదు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలోనే మనిషి ఔన్నత్యం బయటపడుతుంది.
ఒక వేళ మీ విషయం మీ భర్తకు తెలిస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతా ‘మన మంచికే ’ అని ‘ఆత్రేయ’ గారు అన్నట్లు, ఆ మూడో వ్యక్తి వల్ల ఒక విధంగా మీకు, మీ కుటుంబానికి, మంచి జరిగినట్లయింది. మీరు మీ మనోవేదనలోంచి త్వరగా బయటపడేందుకు మీ దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ కుంగుబాటును తగ్గించేందుకు కొన్ని మందులు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’, మీ భార్య భర్తల మధ్య ఏదైనా అంతరాలుంటే సరిదిద్దుకునేందుకు ‘కపుల్ థెరపీ’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా మీ సమస్యలోంచి త్వరగా బయటపడి మీలో మానసిక ప్రశాంతత, సమస్యను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వచ్చేలా చేయవచ్చు. కాలమే మనసుకు తగిలిన గాయాలను మాన్పుతుంది! మనసైనా, మనిషైనా, మనది కానిది, ఎన్నటికీ మనది కాబోదనే జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి! ఆల్ ది బెస్ట్.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
(చదవండి: 'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..)