నొప్పిలోనూ చిన్న చూపా?!

Gender Bias In Healthcare: Women Facing Discrimination Say Researches - Sakshi

అన్నింటా వివక్ష ఉన్నట్టే..  ఆరోగ్య చికిత్సలోనూ స్త్రీల పట్ల వివక్ష ఉందా?! ఎందుకంటే, పురుషుల కంటే స్త్రీల నొప్పిని వైద్యులు తక్కువ అంచనా వేస్తారని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. 

నొప్పితో బాధపడుతున్న పురుషుడిని వాస్తవికవాదిగా చూస్తే, స్త్రీని హిస్టీరికల్, భావోద్వేగాలకు లోనయ్యేవారిలా చూస్తారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన 77 అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీల ఆరోగ్యం విషయంలో ఇంటి నుంచి ఆసుపత్రుల దాకా ప్రపంచవ్యాప్తంగా ఎందుకీ వివక్ష?!

తలనొప్పి, కడుపునొప్పి, కాలు, చెయ్యి, మెడ, నడుము నొప్పి.. బాధిస్తోందని హాస్పిటల్‌కి వెళితే అక్కడ అవసరానికి సరైన చికిత్స లభిస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ చాలా మంది మహిళలు కొత్తరకమైన హింసను ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య రక్షణ అందించేవారు పురుషుల కంటే స్త్రీలలో నొప్పిని తక్కువ అంచనా వేస్తున్నారని అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ తెలియజేసింది.

ఈ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ టీనా దోషి ‘స్త్రీ, పురుష తేడా లేకుండా అందరిలోనూ తలనొప్పి, న డుము, మెడ నొప్పి, కడుపునొప్పి, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ఉన్నాయి. అయితే, పురుషుల కన్నా స్త్రీలలో వచ్చే నొప్పుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కూడా పరిశోధనలు ఉన్నాయి. దీని వల్ల కూడా ఇలాంటి ఒక అభిప్రాయం కలగచ్చు’ అంటారు ఆమె.

పరీక్షా గదిలోనూ...
మియామీ న్యూరోసైన్స్‌ లేబొరేటరీలో జరిపిన ఒక అధ్యయనంలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న రోగుల వీడియోలను చూసినప్పుడు అందులోని వైద్య విద్యార్థులు, వైద్యులు స్త్రీల నొప్పిని పురుషుల కంటే తక్కువ అంచనా వేసినట్టు గుర్తించారు. ‘చేయి విరిగిందని ఎక్స్‌ రే చూపిస్తే వైద్యుడికి ఒక స్పష్టమైన భావం ఉంటుంది.

అదే కడుపునొప్పి లేదా తెలియని ఏదైనా రుగ్మత ఉందని సంప్రదిస్తే అంటే నిర్ధారణ పరీక్షల ద్వారా ఇంకా గుర్తించలేని సమస్య అయితే అప్పుడు నొప్పి తాలూకు అంచనా స్త్రీలో మానసికపరమైనదిగా చూడచ్చు’ అంటారు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఉన్న జానిస్‌ సబిన్‌. నొప్పి తాలూకు సమస్యను అనుభవించే వ్యక్తికి మాత్రమే నిజంగా ఎలా అనిపిస్తుందో తెలుస్తుంది. వాస్తవమా, కాదా అనే విషయాల్లో బేరీజు వేయడంలో కొంచెం తేడా అయితే ఉండొచ్చు’ అని వివరిస్తారాయన. 

అనుకోని పక్షపాతం
వాస్తవానికి డాక్టర్లు ఉన్నదే రోగులకు సాయం చేయడానికి. ‘కానీ, ప్రపంచవ్యాప్తంగా 77 ‘పెయిన్‌ స్టడీస్‌’ పరిశీలిస్తే పురుషులను వాస్తవాలు చెప్పేవారిగా చూసే అవకాశం ఉంది. స్త్రీలలో భావోద్వేగాలకు లోన య్యారేమో అని చూసే అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో వర్ణవివక్ష కారణంగా ఆడవారిలోనే పక్షపాతం చూపే అవకాశాలూ లేకపోలేదు’ అంటారు టీనా. 

ఇంటిలోనే వివక్ష..
‘వైద్యులదాకా వెళ్లడానికి ముందు మన ఇంటి వాతావరణంలోనే చూద్దాం. పురుషుల నొప్పి కన్నా స్త్రీ నొప్పిని ఇంటిలోనే తక్కువ అంచనా వేస్తారు. స్త్రీ నొప్పి అంటే కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సర్దుబాటు చేస్తారు. అదే మగవారు ‘నొప్పి’ అంటే కొంత అలెర్ట్‌ అవుతారు. అలాగే, ఇతర ఆరోగ్య నిపుణులు కూడా పురుషులతో పోల్చితే వ్యాయామాలు చేయడం, ఆహార జాగ్రత్తలు పాటించడం.. వంటివి స్త్రీలలో తక్కువ స్థాయిలో ఉన్నాయని నివేదికలు ఇచ్చారు.

మానసిక చికిత్స ద్వారా స్త్రీ నొప్పి నుంచి కోలుకోవడానికి ఎక్కువ ప్రయోజనం పొందితే, పురుషులకు మందులు ఎక్కువ అవసరమవుతున్నాయ’ని అంటారు మియామీ విశ్వవిద్యాలయ డైరెక్టర్‌ ఎలిజబెత్‌ లోసెన్‌. అయితే, ఇప్పటికీ పాత మూస పద్ధతుల ఆధారంగానే మహిళల నొప్పి గురించి విశ్లేషిస్తున్నారని, వారి వాస్తవిక దృక్కోణంలోనూ, ఆధునిక జీవన విధానంలోనూ చాలా తేడా వచ్చిదంటున్నారు పరిశోధకులు. చికిత్సలో వివక్ష ఉండదని, వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఉండేవారిలో శారీరక నొప్పుల సంఖ్య తక్కువనేది నిపుణుల అభిప్రాయం. 

ఒత్తిడిని బట్టి చికిత్స
బయటకు చెప్పుకోలేని మానసిక సమస్యల ప్రభావం శరీరం మీద పడుతుంది. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. మగవారితో పోల్చితే మహిళల్లో యాంగై్జటీ పర్సంటెజీ ఎక్కువ ఉంటుంది. మహిళ మానసిక స్థితిపై ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంటి విషయాలు, రిలేషన్స్, పిల్లలకు సంబంధించినవాటిలో ఏదైనా ఒత్తిడికి లోనైనప్పుడు సైకోసోమాటిక్‌ సమస్యలు వస్తుంటాయి.

చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళితే ‘ఏమీ లేదు స్ట్రెస్‌ అయ్యారు’ అని డాక్టర్‌ చెబితే ఇంట్లోవాళ్లే ‘నొప్పి ఏమీ లేదు, నువ్వు అనవసరంగా డబ్బులన్నీ ఖర్చుపెట్టిస్తావ్‌...’ అని కోప్పడేవారుంటారు. ఇది కూడా స్త్రీలలో ఒకరకమైన ఒత్తిడిని పెంచుతుంది. మగవారిలో అయితే ఇంటి బయటి విషయాలమీద దృష్టి ఎక్కువ ఉంటుంది. పొగతాగడం, మద్యం సేవించడం, వ్యసనాలు.. వీటికి సంబంధించిన సమస్యల వల్ల బాడీ పెయిన్స్‌ రావడం ఎక్కువ గమనిస్తుంటాం. ఇద్దరిలోనూ సమస్య మూలాలను కనుక్కొని చికిత్స చేస్తాం. – డాక్టర్‌ కె. హరిణి, సైకియాట్రిస్ట్‌

తేడా లేదు...
చికిత్సలో ఆడ–మగ ఇద్దరినీ ఒకే విధంగా చూస్తాం. కొన్ని సందర్భాల్లో ఆడ–మగ సమస్యల్లో కారణాలు వేరు వేరుగా ఉంటాయి. అవి హార్మోన్లలో తేడాల వల్ల వస్తాయి. పేషెంట్‌లో ఉండే సమస్యను బట్టి చికిత్స ఉంటుంది తప్పితే ఎక్కువ–తక్కువ అంచనా వేయడం ఏమీ ఉండదు. – డాక్టర్‌. జి.నవోదయ, జనరల్‌ మెడిసిన్‌ 
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top