యముడి అపరాధ ఫలమే విదురుడి జన్మ! | A Ethic And Moral Story With A Good Message | Sakshi
Sakshi News home page

యముడి అపరాధ ఫలమే విదురుడి జన్మ!

May 28 2026 8:42 AM | Updated on May 28 2026 8:42 AM

A Ethic And Moral Story With A Good Message

పురాగాథ

మాండవ్యముని ఊరి వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజు కొందరు దొంగలు రాజధనాన్ని అపహరించి రాజభటులు వెంట తరమగా మాండవ్య ముని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజభటులు వచ్చి ఇటుగా ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌనవ్రతంలో ఉన్న ముని జవాబు చెప్పలేదు.

రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి దొంగలను పట్టుకుని మాండవ్యునికి వారితో సంబంధం ఉన్నదని అనుమానించారు. వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలపెట్టారు. రాజుగారు దొంగలకు మరణశిక్ష విధించి వారితో సంబధం ఉందని అనుమానించి మాండవ్యమునికి ఇనుప శూలం మీద కూర్చోపెట్టమని మాండవ్యునికి శిక్ష వేసాడు. అందుకు భయపడని మాండవ్యుడు తన తపస్సు కొనసాగించారు.

ఒకరోజు రాత్రి కొంతమంది మహాఋషులు పక్షి రూపాలతో అక్కడకు వచ్చి మాండవ్యుని చూసి ‘‘మహానుభావుడవైన నీకు ఈ శిక్ష ఏమిటి ఇలా ఎవరు చేసారు?’’ అని ప్రశ్నించారు. అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని. అందుకు ఎవరినీ నిందించ వలదని చెప్పాడు. ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే అతనిని కిందకు దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పాడు.

శూలం అతని శరీరంలోనుండి బయటకు రానందున దానిని నరికించగా శరీరంలో కొంతభాగం మాత్రం మిగిలి ΄ోయింది. ఆ తరువాత అతడు ఆణి మాండవ్యుడునే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత యమపురికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజు ఈ శిక్ష వేయటానికి కారణం ఏమిటని అడిగాడు. యమధర్మరాజు మాండవ్యునితో ‘మహా మునీ చిన్నతనంలో నీవు తూనీగలను పట్టుకుని ఆనందించే వాడివి. అందు వలన ఈ శిక్ష అనుభవించావు’ అన్నాడు. అది విన్న మాండవ్యుడు కోపంతో ‘పద్నాలుగేళ్ళ వరకూ పిల్లలు ఏమి చేసినా తెలియక చేస్తారు.

అందువల్ల ఇక మీదట పద్నాలుగేళ్ళలోపు బాలురు చేసే తప్పుకు ఫలితం వారిది కాదు. వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది. కానీ యమధర్మరాజా నేను బాల్యమందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు కనుక నీవు మానవ గర్భంలో జన్మించెదవు కాక’ అన్నాడు. ఆ శాప ఫలితమే వ్యాసుని వలన యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టినట్లు మహాభారత గాథ ద్వారా తెలుస్తుంది. – డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement