జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..! | During the monsoon season be cautious with your pet dogs risks of rabies | Sakshi
Sakshi News home page

జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..! ముసురు వేళ ర్యాబిస్‌ సోకే ఛాన్స్‌..

Jul 3 2025 10:57 AM | Updated on Jul 3 2025 11:11 AM

During the monsoon season be cautious with your pet dogs risks of rabies

వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్‌ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్‌ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్‌ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్‌తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. 

వీధి కుక్కలతో జర జాగ్రత్త.. 
వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్‌ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. 

పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్‌లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. 

పెట్స్‌కు ర్యాబిస్‌ సోకినప్పుడు వైరస్‌ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. 

రేబిస్‌ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం మేలు. 
– డా.డీ.అశోక్‌ కుమార్, అసోసియేట్‌ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్‌.

ఈ సీజన్‌లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్‌ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్‌ వైరస్‌కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్‌ ఇప్పించినట్లైతే పెట్స్‌ను రక్షించుకోవచ్చు.

నివారణ చర్యలు.. 
పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. 

ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్‌ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. 

ర్యాబిస్‌ వైరస్‌ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్‌ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం  లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్‌ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం.   

(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement