ఎలాంటి వారికి సీజెరియన్‌ సజెస్ట్‌ చేస్తారు? స్ట్రెచ్‌ మార్క్స్‌ పోవాలంటే..

Doctors Csection Might Be Recommended For Women Which Situation - Sakshi

ఇప్పుడు నాకు 9వ నెల. నార్మల్‌ డెలివరీ అంటే భయం. అసలు సిజేరియన్‌ బర్త్‌ అంటే ఏంటీ? ఎలాంటి వారికి దీన్ని సజెస్ట్‌ చేస్తారు?
– వి. హీరా, ధర్మాబాద్‌

చాలామందికి 9వ నెల చివర్లో సహజంగా నొప్పులు వచ్చి నార్మల్‌గా వెజైనల్‌ బర్త్‌ అవుతుంది. కానీ కొంతమంది గర్భిణీలు ఇలా నొప్పులు తీయడానికి భయపడుతుంటారు. ఇంకొంతమందిలో బిడ్డ పొజిషన్‌ నార్మల్‌ డెలివరీకి అనుకూలంగా ఉండదు. అలాంటివాళ్లందరికీ సిజేరియన్‌ బర్త్‌ను సజెస్ట్‌ చేస్తారు. సిజేరియన్‌ బర్త్‌లో బిడ్డకు, తల్లికి కొన్ని రిస్క్స్‌ ఉంటాయి. ఇది చిన్న ప్రొసీజర్‌ కాదు. పెద్ద ఆపరేషన్‌. ఆపరేషన్‌ సంబంధిత రిస్క్స్‌ కూడా ఉంటాయి.

వీటన్నిటినీ మీ డాక్టర్‌ మీతో డీటెయిల్డ్‌గా డిస్కస్‌ చేస్తారు. వ్యక్తిగత కారణాలు, కన్‌సర్న్స్, ఫీలింగ్స్‌తో మీకు ఆపరేషనే కావాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి ఆపరేషన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు.. తలెత్తే సమస్యలను మీకు వివరిస్తారు. వెజైనల్‌ డెలివరీకి భయపడి.. ఆపరేషన్‌కి వెళ్లేవారికి కౌన్సెలింగ్‌ సెషన్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ సెషన్‌లో గైనకాలజిస్ట్, మత్తు డాక్టర్, మానసిక వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్ట్‌ ఉంటారు. భయాన్ని ఎలా ఎదుర్కోవాలో.. పెయిన్‌ రిలీఫ్‌కి బెస్ట్‌ ఆప్షన్స్‌ ఎన్ని ఉన్నాయో సూచిస్తారు. ఆందోళన, టెన్షన్‌కి కారణాలు చెప్పి.. వాటిని అధిగమించి వెజైనల్‌ బర్త్‌కి ప్రయత్నించమనీ చెప్తారు.

ఎపిడ్యూరల్‌ ఎనాలిసిస్, బర్తింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చెప్తారు. ఈ కౌన్సెలింగ్‌ తర్వాత కూడా మీరు సిజేరియన్‌ బర్త్‌నే కావాలనుకుంటే.. ఎప్పుడు ఆ డెలివరీని ప్లాన్‌ చేస్తే మంచిదో చెప్తారు. కొన్ని కేసెస్‌లో సిజేరియన్‌ డెలివరీ తర్వాత బిడ్డకు ఏర్పడే రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ వల్ల బిడ్డను ఎన్‌ఐఐయులో అడ్మిట్‌ చేసే చాన్సెస్‌ ఎక్కువ ఉండొచ్చు. అలాంటివి ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సిజేరియన్‌ సెక్షన్‌ తర్వాత కుట్లు నొప్పి లేకుండా.. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా త్వరగా మానడానికి స్పెషల్‌ మెడికేషన్‌ ఇస్తారు. ఆపరేషన్‌ వల్ల టిష్యూలో Adhensions ఏర్పడే చాన్సెస్‌ పెరుగుతాయి. దీనివల్ల తర్వాత డెలివరీ అప్పుడు ఆపరేషన్‌ టైమ్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చు. బ్లాడర్, పేగు వంటివీ గాయపడే చాన్సెస్‌ ఉంటాయి. సాధారణంగా 39 వారాలు పూర్తయిన తర్వాత సిజేరియన్‌ చెయ్యడం మంచిది. కానీ మీకు బీపీ, సుగర్, బిడ్డ పెరుగుదలలో సమస్యలు ఉంటే కనుక కొంచెం ముందుగా ప్లాన్‌ చేస్తారు. 

స్ట్రెచ్‌ మార్క్స్‌ మాయం
ప్రసవం తర్వాత మహిళలను స్ట్రెచ్‌ మార్క్స్‌  చాలానే ఇబ్బంది పెడుతుంటాయి. కొంత మందిలో పెరిగిన బరువు తగ్గిన తర్వాత కూడా ఇవి ఏర్పడుతుంటాయి. వీటినిపోగొట్టేందుకు చాలామంది అనేక రకాల క్రీములు వాడుతుంటారు. అయితే సహజమైన పద్ధతుల్లో వీటిని తగ్గించుకోవచ్చు. చర్మానికి తేమను అందించే గుణం కొబ్బరినూనెకు ఉంటుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న చోట గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్‌ చేయాలి. దీని వల్ల చారలు పోవడమే కాకుండా సాగిన పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే బంగాళదుంప రసం, కలబంద గుజ్జునూ స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టేందుకు వాడొచ్చు. వీటిని స్ట్రెచ్‌ మార్క్స్‌ పైరాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మార్క్స్‌ తగ్గటంతో పాటు ఇవి మంచి మాయిశ్చరైజర్స్‌గానూ పనిచేస్తాయి. 
డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top