జుట్టు రాలిపోయే... స్కిన్‌పాలిపోయే! తీసుకోవాల్సిన జాగ్రత్తలు | do you know How Air Pollution and other Affects in Skin and hair | Sakshi
Sakshi News home page

Hidden Threats : జుట్టు రాలిపోయే.. స్కిన్‌పాలిపోయే!

Jul 22 2025 10:03 AM | Updated on Jul 22 2025 1:15 PM

do you  know How Air Pollution  and other Affects in Skin and hair

మనపై వాతావ‘రణం’ 

మన దేహంలోని అంతర్గత అవయవాలను కాపాడేది చర్మం. మళ్లీ ఈ చర్మం తాలూకు రోమాంకురాల నుంచి పెరిగి... ఆ చర్మాన్నీ, దాంతోపాటు చాలావరకు దేహాన్ని కాపాడేవి వెంట్రుకలు. అయితే  ఇటీవల వాహనాల కాలుష్యం, కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలు... ఇవన్నీ వాతావరణంలో కలిసి΄ోవడంతో ఇటు చర్మం మీదా, ఆపై కురుల మీదా దుష్ప్రభావాలు చూడటంతో వాటి తొలి ప్రభావం పడేది చర్మం మీదనే. 

తర్వాతి ప్రభావం జుట్టు మీద! కాలుష్యంతో పాటు నేరుగా పడే సూర్యకాంతి తీక్షణతకూ ఈ రెండూ ప్రభావితమవుతాయి. మన చుట్టూ ఉండే వాతావరణంలో దుమ్ము, ధూళి, సస్పెండెండ్‌పార్టికిల్స్‌  కాలుష్యాల వంటి వాటితో చర్మంపైనా, దాంతో పాటు వెంట్రుకలు జుట్టు పడేదుష్ప్రభావాల నుంచి కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

చర్మం మన దేహాన్ని ఆవరించి ఉండే అతి పెద్ద అవయవం. ఇది శరీరంపై ఉండాల్సిన తేమను ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటుంది. కాలుష్య పదార్థాలు ఈ ప్రక్రియపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉండటంతో క్రమంగా మేనిపైనుండే తేమ ఏ మేరకు ఉండాలో నియంత్రించే శక్తిని చర్మం క్రమంగా కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిపొడిగా మారి, పొలుసులు (స్కేలీ)గా విచ్చుకు పోయే అవకాశముంది. ఎగ్జిమా వంటి అలర్జీ సంబంధమైన చర్మవ్యాధులున్న వారిలో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఫలితంగా వాతావరణ కాలుష్యాల వల్ల చర్మం మరింతగా దురదలు పుడుతూ, ఎర్రబారే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ కాలుష్యాల వల్ల ప్రధానంగా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ల్యాబరేటరీ పరిశోధనల్లో తేలింది. చిన్న పిల్లల చర్మంపై వీటి ప్రభావం మరింత ఎక్కువ.  

ఎందుకిలా జరుగుతుందంటే... 
మొదటి కారణం సీబమ్‌ స్రావం... : వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్న కారణంగా తేమ (హ్యూమిడ్‌) బాగా పెరిగినప్పుడు మన చర్మంపై ఉండే సబేషియస్‌ (ఒక రకమైన నూనెను స్రవించే) గ్రంథులు ఎక్కువగా పనిచేస్తాయి. దాంతో చర్మంపై మరింత చెమట, సీబమ్‌ (సబేషియస్‌ గ్రంథుల నుంచి స్రవించే నూనె) ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అటు వాతావరణంలోనూ, ఇటు అత్యధిక ట్రాఫిక్‌ కారణంగా ఆటోమొబైల్‌ కాలుష్యంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కాలుష్య పదార్థాలు చర్మంపై పడి సబేషియస్‌ గ్లాండ్‌ నుంచి మరింతగా సీబమ్‌ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దాంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే నగరాల్లోని వాతావరణం కారణంగా చర్మం మరింతగా దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది.

వయసు పెరగడంతో వచ్చే మార్పులు త్వరితం కావడం... 
కాలుష్యం దుష్ప్రభావం కారణంగా ఏజింగ్‌ మరింత చురుగ్గా జరుగుతుంది. అంటే వయసు పెరగడం వల్ల చర్మంపైన కనిపించే వృద్ధాప్య లక్షణాలైన చర్మం ముడుతలు పడటం, చర్మంపై ఏజింగ్‌ మార్క్స్, రింకిల్స్, మచ్చలు రావడం వంటివి... రావాల్సిన టైమ్‌ కంటే ముందుగానే వస్తాయంటూ కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇందుకు కారణం... కాలుష్యం... చర్మం కణ సముదాయాల్లో (మాలెక్యూల్స్‌లో) వయసు పరంగా  తెచ్చే మార్పులను చాలా త్వరగా వచ్చేలా చేయడమే.

వాతావరణంలోని కర్బన కాలుష్యాలతోనూ..
ఇంధనం మండటంతో గాల్లోకి వెలువడే కర్బన కాలుష్య కణాలు  (పొల్యూషన్‌ పార్టికిల్స్‌), పాలీ అరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ వంటివి కూడా వయసు మీద పడటం వల్ల చర్మంపై కనిపించే మార్పులను చాలా వేగవంతం చేస్తాయి. వాతావరణంలో, గాలిలో  కార్బన్‌ కాలుష్యాలు ఎంత ఎక్కువగా ఉంటే వయసు మీదపడటంతో వచ్చే మార్పులు అంత ఎక్కువంటూ ఒక పరిశోధన తాలూకు ఫలితాలు ‘జర్నల్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ డెర్మటాలజీ’ అనే సైన్స్‌ మ్యాగజైన్‌ / జర్మల్‌లో ప్రచురితమయ్యాయి. చర్మంలో ఒక కణం మరొక కణంతో కలిసి ఉండేందుకు కొలాజెన్‌ తోడ్పడుతుంది. కాలుష్యాల వల్ల కొలాజెన్‌తో సమకూరే బంధం బలహీనమ వుతుంది. అందుకే వృద్ధాప్యంలో వచ్చే ముడుతలు కాలుష్యం వల్ల చాలా త్వరగా / వేగంగా వస్తాయి.

అల్ట్రా వయొలెట్‌ కిరణాల ప్రభావంతో... 
చర్మంపై అల్ట్రా వయొలెట్‌ కిరణాల ప్రభావం చాలా ప్రతికూలంగా పడుతుందన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్‌ కారణంగా గాలిలో కలుస్తున్న కాలుష్యాల ప్రభావంతో భూమి ఉపరితల వాతావరణంపై ఉండే ఓజోన్‌ పొర దెబ్బతింటోంది. ఫలితంగా ఓజోన్‌ పొరలో...చర్మానికి హానికరమైన అల్ట్రా వయొలెట్‌ కిరణాల వడ΄ోత కూడా దెబ్బతింటోంది. దాంతో మునుపటి కంటే ఇప్పుడు అల్ట్రా వయొలెట్‌ కిరణాల తీవ్రత పెరడగం... దాని ఫలితంగా చర్మక్యాన్సర్, చర్మం నల్లబారడం (పిగ్మెంటేషన్‌) వంటి పరిణామాలూ ఎక్కువ కావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా మరికొన్ని అధ్యయనాలూ, పరిశోధనల్లో తేలింది.

చర్మంపైనే కాకుండా... వెంట్రుకలూ, జుట్టుపైన కూడా... 
ట్రాఫిక్‌ కాలుష్య దుష్ప్రభావం కేవలం చర్మంపైనే గాక వెంట్రుకలూ, జుట్టుపైన కూడా  పడుతోంది. కాలుష్యం కారణంగా వెంట్రుకలు రాలి΄ోవడమన్నది చాలా సాధారణంగా కనిపించే పరిణామం. ఇలా వెంట్రుకలు రాలి΄ోవడం అన్నది నగరీకరణ, ΄ారీశ్రామికీకరణ ఎక్కువగా ఉన్నచోట్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పల్లెలు, ఓ మోస్తరు పట్టణాలతో ΄ోలిస్తే పెద్ద పట్టణాలూ, నగరాల్లో కాలుష్యాలు మరింత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. 

కాలుష్యం నుంచి చర్మాన్ని, వెంట్రుకలను కాపాడుకోవడం ఎలా? 

  • కాలుష్యాలై పొగ, దుమ్ము, ధూళి, రేడియేషన్‌ వంటివి నేరుగా మేనిని తాకకుండా వీలైనంతమేరకు చర్మం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ముఖం, చేతులను రక్షించుకోడానికి స్కార్ఫ్, గ్లవ్‌జ్‌ వంటివి తొడుక్కోవాలి. 

  • చర్మానికి, వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండేవైన ఆకుపచ్చని కూరలు (గ్రీన్‌ లీఫీ వెజిటబుల్స్‌), తాజా పండ్లు,   విటమిన్‌ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

  • బయటకు వెళ్లడానికి కనీసం 15–20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. దీనికి తోడు బయటకు వెళ్లాక కూడా ప్రతి రెండు, మూడు గంటలకోమారు మళ్లీ సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటూ ఉండాలి. 

  • ప్రతి రోజూ చర్మం, వెంట్రుకలు శుభ్రం అయ్యేలా స్నానం చేయాలి.

వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే... 
 

  • వెంట్రుకలను షాంపూతో క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అయితే  వెంట్రుకలను మరీ ఎక్కువగా కడగటం మంచిదికాదని గుర్తుంచుకోవాలి. ఇలా అవసరమైనదానికంటే వెంట్రుకలను ఎక్కువగా కడుగుతూ ఉంటే అవి పొడిబారవచ్చు. 

  • అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్‌ కట్టుకోవడం, బ్రిమ్‌ హ్యాట్‌ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఒకవేళ చుండ్రు వంటి సమస్య ఉంటే కీటోకెనజాల్‌ లేదా సైక్లోపిరోగ్సాలమైన్‌ ఉండే షాంపూలతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. 

  • వెంట్రుక చివర్లు చిట్లిపోకుండా ఉండేలా ప్రతి ఆరువారాలకు ఓమారు జుట్టును ట్రిమ్‌ చేసుకోవాలి. 
    రంగు వేసుకునేవారైతే అది సరిపడుతోందా లేదా అన్నది పరిశీలించుకున్న తర్వాతే దాన్ని వాడటం మొదలుపెట్టాలి.

జుట్టు ఊడిపోతుంటే ఈ జాగ్రత్తలు పాటించండి... 
 

  • తమ జట్టు బాగా రాలిపోతోందంటూ చాలామంది ప్రతిరోజూ ఆందోళన పడుతుంటారు. అయితే ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ దాదాపు నూరు వెంట్రుకల (స్ట్రాండ్స్‌) వరకు కోల్పోతుంటారు. ఇది చాలా సాధారణం. అయితే అదే పనిగా జుట్టు ఊడిపోవడం వల్ల తమకు బట్టతల వచ్చేస్తుందేమోనని చాలామంది ఆందోళన పడుతుంటారు. వాళ్ల ఆందోళన తీరాలంటే చేయాల్సిందేమిటంటే... 

  • జుట్టుకు అవసరమైన మూడు పోషకాలు జింక్, ఐరన్, విటమిన్‌–సీ. ఈ మూడూ  జుట్టును సంరక్షిస్తూ, దాని మెరుపును కాపాడుతుండే ముఖ్యమైన మూడు అంశాలుగా చెప్పవచ్చు. అందుకే మనం తీసుకునే ఆహారంలో ఈ మూడూ సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఆహారంలో తీసుకోవాల్సినవి... 


జింక్‌ కోసం : జుట్టుకు అవసరమైన జింక్‌ కోసం మీ ఆహారంలో గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకునేలా జాగ్రత్తపడాలి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్‌తో పాటు, ఐరన్‌ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్‌ న్యూట్రిషన్‌ ఫౌండేషన్‌ సిఫార్సు చేస్తోంది. ఆహార పదార్థాలన్నింటిలోనూ జింక్‌ గుమ్మడి గింజల్లో చాలా ఎక్కువగా లభిస్తుంటుంది. అలాగే సీఫుడ్స్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలో కూడా జింక్‌ మోతాదులు ఎక్కువ. దాంతోపాటు పుచ్చకాయ తినేటప్పుడు వాటి గింజలనూ ఊసేయకుండా తినడం మంచిది. ఎందుకంటే పుచ్చకాయ గింజల్లోనూ జింక్‌ ఎక్కువే. 

ఐరన్‌ కోసం : ఆహారంలో ఐరన్‌ సమృద్ధిగా దొరకడం కోసం గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్‌ వంటివి తీసుకోవచ్చు. ఇక మాంసాహారంలోనైతే  కాలేయం, కిడ్నీల్లో ఐరన్‌ చాలా ఎక్కువ. శాకాహారులైతే  ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్‌ ఎక్కువని తెలుసుకుని మీరు తీసుకునే ఆహారంలో అలాంటి ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి. 

విటమిన్‌–సీ కోసం : మనకు అందుబాటులో ఉన్న అన్ని ఆహార పదార్థాలతో ΄ోలిస్తే ఉసిరిలో నాణ్యమైన విటమిన్‌–సి పుష్కలంగా దొరుకుతుంది. దాంతోపాటు ఇక నిమ్మజాతి  పండ్లన్నింటిలోనూ విటమిన్‌–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మిగతావాటితో పోలిస్తే... బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం కాస్త తక్కువేనని చెప్పవచ్చు.

అప్పటికీ జుట్టు రాలుతుంటే... 
ఇక్కడ చెప్పినవన్నీ తీసుకుంటూ, వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయడం వంటి జుట్టు హైజీన్‌ పాటిస్తున్నప్పటికీ జుట్టు రాలిపోతుంటే ఒకసారి థైరాయిడ్‌ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్‌ హార్మోన్‌ అసమతౌల్యత జుట్టు రాలే ముప్పును తెచ్చిపెడుతుంది. దేహంలో అలాంటి సమస్య / అనారోగ్యం ఏదైనా ఉంటే దాన్ని డాక్టర్లు పరిష్కరిస్తారు. ఒకవేళ ఇలాంటి సమస్యను స్వాభావికంగానే నివారించుకోవాలంటే... చేపలు ఎక్కువగా తినేవారిలో థైరాక్సిన్‌ అసమతౌల్యత సమస్య చాలా తక్కువని తెలుసుకోండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగగకపోతే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్‌లు లేదా ట్రైకాలజిస్ట్‌ల వంటి నిపుణులను కలవాల్సి ఉంటుంది. 

డా. స్వప్నప్రియ
సీనియర్‌ డర్మటాలజిస్ట్‌   
 

చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement