ఆమె గళమే ఒక అర్చన...

Devotional Singer Kavita Paudwal Birthday Special - Sakshi

Devotional Singer Kavita Paudwal Birthday Special: మీరు విఘ్నేశ్వరుని భక్తులా? నిన్న మొన్న విడుదలైన అనురాధా పౌడ్వాల్‌ భజన‘మంగళకర్త సుఖ్‌ కే దాతా’ వినండి. ఆదిశక్తిని స్తోత్రించాలా?‘అంబే తూహై జగదంబే కాళీ’ వినండి. సాయి బాబా భక్తులైతే అనురాధా పౌడ్వాల్‌ పాడిన ‘షిర్డీ సాయిబాబా అమృత్‌వాణి’ ఉంది. అనురాధా పౌడ్వాల్‌ సినీ గాయనిగా  ఎంత ఉల్లాసాన్ని పంచిందో భక్తి గాయనిగా అంత ఆధ్యాత్మికతనూ పంచింది. ఆమె కుమార్తె కవితా పౌడ్వాల్‌ ఇప్పుడు దేశంలో ప్రఖ్యాత భక్తి గాయని. దేశం అభిమానించే ఈ గొప్పగాయని 68వ పుట్టినరోజు నేడు.

తెలుగువారిలో సాయిభక్తులకు అనురాధా పౌడ్వాల్‌ పాడిన ‘సాయి అమృతవాణి’ సుపరిచితం. తెలుగులో ఆమె పాడిన భక్తి గీతం అది. తెలుగులోనే కాదు టి–సిరీస్‌ చొరవతో సాయి భక్తి గీతాలను ఆమె అనేక భాషల్లో పాడింది. హిందీలో పాడిన భక్తి సంగీతం ఉత్తరాదిలో ఆమెను ఇంటింటి గాయనిగా చేసింది. ప్రతి ఉదయం ఆమె పాటతో నిద్ర లేచే కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. ఆమె ముఖచిత్రం ముద్రించిన సిడిలు, డివిడిలు నేటికీ అమ్ముడుపోతున్నాయి. యూట్యూబ్‌లో ఆమె భక్తి పాటలకు లక్షలాది హిట్స్‌ ఉంటాయి. శివుడు, వైష్ణోదేవి, హనుమంతుడు, గణేశుడు, లక్ష్మీదేవి... ప్రతి దేవుడివి, దేవతవి భక్తి గీతాలు అనురాధ పౌడ్వాల్‌ పాడింది. సినిమా సంగీతంలో కెరీర్‌ పీక్‌లో ఉండగా వాటి నుంచి విరమించుకుని తన జీవితాన్ని భక్తి సంగీతానికే అంకితం చేస్తానని ప్రకటించిన గాయని అనురాధా పౌడ్వాల్‌.

జాతకంలో ఉంది
అనురాధా పౌడ్వాల్‌కు పాటలంటే ఆసక్తి ఉన్నా పాడాలని అనుకునేది కాదు. లతా మంగేశ్కర్‌ పాటలంటే మాత్రం చెవి కోసుకునేది. సరదాకి కాలేజీల్లో, కొన్ని స్టేజ్‌ షోలలో మైక్‌ అందుకునేది. అయితే టీనేజ్‌లో ఉండగా ఆమెకు న్యుమోనియా వచ్చి 40 రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది. ఊపిరి తిత్తులు శక్తికోల్పోయి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆ సమయంలో ఆమెకు ధైర్యం కోసం మేనమామ ఒక టేప్‌ రికార్డర్, లతా పాటలున్న కేసెట్లు ఇచ్చి వెళ్లాడు. 40 రోజులు ఆ పాటలు వింటూనే జబ్బు నుంచి బయటపడింది. ఆ తర్వాత ఆమె గొంతులో ఒక మెలొడీ వచ్చిందని అనురాధా చెప్పుకుంది.

లతాలాగా ప్లేబ్యాక్‌ సింగర్‌ కావాలని ఆమెకు ఉండేది. 18 ఏళ్లకు సంగీత సహాయకుడు అరుణ్‌ పౌడ్వాల్‌తో పెళ్లవగా అతడు ప్రోత్సహించేవాడు. ఒకసారి అతడు ఆమెను రికార్డింగ్‌ స్టూడియోకి తీసుకెళితే అక్కడ లతా పాడుతున్న పాటను క్షుణ్ణంగా గమనించిన అనురాధా ఆ తర్వాతి వారం ఆల్‌ ఇండియా రేడియో యువవాణిలో యథాతథంగా పాడి శ్రోతలను ఆకర్షించింది. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఆ ప్రోగ్రామ్‌ విని ఆమె గురించి ఆరా తీశారు. ఎస్‌.డి.బర్మన్‌ ఆమెతో ‘అభిమాన్‌’ సినిమాలో ఒక శ్లోకం కూడా పాడించాడు. అయితే ఆ తర్వాతి ప్రయాణం సులువు కాలేదు. ఆమెకు అవకాశాలు రాలేదు. ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వెళితే ‘నువ్వు భవిష్యత్తులో భక్తిగాయనివి అవుతావు’ అని చెప్పాడు. అది విని అనురాధ ఏడ్చింది. ఎందుకంటే ఆమెకు ప్లేబ్యాక్‌ సింగర్‌ కావాలని ఉంది.

ప్రతి పాటా పెనుగులాట
సుభాష్‌ ఘాయ్‌ తీసిన ‘హీరో’లో ‘తూ మేరా జానూ హై’ పాట అనురాధా పౌడ్వాల్‌ పాడింది. ఆ పాట హిట్‌ అయ్యింది. ఆ తర్వాత ‘ఉత్సవ్‌’లో పాడింది. కాని ఆమెకు అవకాశాలు రాలేదు. ఆమెతో పాడించుకుంటే మొత్తం పాడించుకోండి... ఒకటి రెండు పాటలు ఆమెకు ఇచ్చి మిగిలినవి మా చేత పాడించుకోవాలనుకుంటే మేము పాడము అని ఆశా, లతా హెచ్చరిస్తే సంగీత దర్శకులు వెనుకంజ వేసేవారని అంటారు. దాంతో అనురాధ కేవలం ట్రాక్‌ సింగర్‌గా మిగలాల్సి వచ్చింది.

ఆ సమయంలో ఆమె విరక్తి చెంది భక్తి సంగీతంలోకి మళ్లుదామని ఎంత ప్రయత్నించినా మ్యూజిక్‌ కంపెనీలు ఆ సంగీతానికి మార్కెట్‌ లేదు అని తిరగ్గొట్టాయి. అప్పుడు అనురాధ పౌడ్వాల్‌ అప్పుడప్పుడే సంగీత రంగంలో ఎదుగుతున్న టి–సిరీస్‌ దగ్గరకు వెళ్లింది. దాని అధినేత గుల్షన్‌ కుమార్‌. అతడు ఆ సమయంలోనే నదీమ్‌– శ్రావణ్‌ చేత ఒక 30 పాటలు చేయించి (సమీర్‌ రాశాడు) వాటిని మూడు సినిమాలకు పంచి మహేశ్‌ భట్‌ చేత మూడు సినిమాలు తీయించాడు. అవే ఆషికీ, దిల్‌ హై కి మాన్‌తా నహీ, సడక్‌. ఆ పాటలన్నీ అనురాధా పౌడ్వాల్‌ చేత పాడించాడు. ఆ మూడు సినిమా లు సూపర్‌హిట్‌ అయ్యాయి. అనురాధ స్టార్‌గా అవతరించింది.

మహా ప్రభావం
అనురాధ పౌడ్వాల్, కుమార్‌ షాను, ఉదిత్‌ నారాయణ్‌ కలిసి ఆ సమయంలో సూపర్‌ హిట్స్‌ పాడారు. అనురాధ పాడిన ‘ధక్‌ ధక్‌ కర్‌నే లగా’ (బేటా) పాట మాధురి దీక్షిత్‌కు లైఫ్‌ ఇచ్చింది. ‘నజర్‌ కే సామ్‌నే జిగర్‌ కే పాస్‌’ (ఆషికీ) ‘ముఝె నీంద్‌ న ఆయే’ (దిల్‌), ‘కెహ్‌ దోకి తుమ్‌’ (తేజాబ్‌), ‘బహుత్‌ ప్యార్‌ కర్‌తేహై’ (సాజన్‌)... అనురాధా పౌడ్వాల్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టాయి. గుల్షన్‌ కుమార్‌ సినిమాల మ్యూజిక్‌ రైట్స్‌ కొంటూ అనురాధా పౌడ్వాల్‌ చేతే పాడించాలని చెప్పడంతో లతా, ఆశాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది.

మరోవైపు గుల్షన్‌ కుమార్‌ అనురాధా పౌడ్వాల్‌ ఫొటోతో భక్తి గీతాల క్యాసెట్‌లు రిలీజ్‌ చేసి ఆమెను ఇంటింటికి చేరువ చేశాడు. కాని 1997 లో కేవలం 41 ఏళ్ల వయసులో గుల్షన్‌ కుమార్‌ హత్యకు గురవడం అనురాధా పౌడ్వాల్‌ మానసిక స్థితిని గట్టి దెబ్బ కొట్టింది. అప్పటికే ఆమె కేవలం టి–సిరీస్‌కే పాడతాను అని ప్రకటించి ఉండటంతో అల్కా యాగ్నిక్‌ పుంజుకుంది. దాంతో అనురాధ మరోసారి భక్తి వైపు మనసు లగ్నం చేసి ఆ సంగీతానికి అంకితమైంది. మళ్లీ సినిమా సంగీతం వైపు రాలేదు.
భర్త, కుమారుడు అకాల మరణం చెందడం అనురాధ జీవితంలో పెను విషాదం. ఆమె కుమార్తె కవిత పౌడ్వాల్‌ సినీ సంగీతం వైపు రాక తల్లిలాగే భక్తి సంగీతంలో కొనసాగుతూ ఉంది. అనురాధ అరాధనా స్వరం కొనసాగాలని కోరుకుందాం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top