భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
దోషాల నుంచి విముక్తికి...
జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.
శాస్త్రీయ కోణంలో ..
రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.
అనుగ్రహం పొందే మార్గం..
ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..!
– పసుపులేటి వెంకటేశ్వరరావు
(చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)


