ఓ త్రండి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే.. నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్నా. అది తన తాహతుకు, శక్తికి మించిన పని అని తెలిసినా.. అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది.
ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు లక్షరూపాయ ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితరసాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ.. ఏదోనాటికి కూతురి కల నెరవేర్చాలంటూ తనకు చేతనైనంతా చేయడం ప్రారంభించాడు.
తన సంపాదనలో మిగిలిని నాణేలన్నీ బాక్స్‌లో వేస్తూ..కొంత సొమ్ము పోగుచేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి..తాను స్కూటర్ కొనాలనుకుంటున్నా అంటూ..ఆ నాణేల సంచిని వారిముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందటూ ఆ నాణేల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూమ్ డైరెక్టర్ ఆనంద్ గుప్తాను మనసుని కదిలించింది.
కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టేవారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి..ఆ సంచిలోని నాణేలన్నింటిని తన సిబ్బందితో లెక్కించారు. అవి మొత్తం రూ. 40,000 అని చెప్పగా. మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటానని అన్నాడు బజరంగా రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తిచేశాడు.
ఆ తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ కుటుంబానికి ఆహ్వానం పలికి. టీ సర్వ్ చేసి మరి సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడూ కూతురు చంపా కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.
(చదవండి: ఆ ప్రొఫెసర్‌కు 150 ప్లస్ డిగ్రీలు..అమ్మ చెప్పిందని..!)


