
ఒకప్పుడు డ్యాన్స్ క్లాస్‌లో చేరుతున్నారంటే.. నృత్యంలో నైపుణ్యం సాధించడానికి అని అనుకునేవాళ్లు. ఇప్పుడు అది క్యాలరీల ఖర్చుకో, వెయిట్‌లాస్ కోసమో అన్నట్టు మారింది. నగరంలో డ్యాన్స్‌ను ఆసక్తితోనో, ఆదాయ మార్గంగా మలుచుకుందామనో అనుకునేవారికన్నా.. సమూహంలో కలిసిపోవడానికి, సందడిగా గడపడానికి, వీటన్నింటినీ మించి ఆరోగ్య మార్గంగా చూస్తున్నవారే ఎక్కువయ్యారు.
బరువులు మోస్తూ వ్యాయామం చేయడానికి ఇష్టపడని, జిమ్ వర్కవుట్స్‌కి దూరంగా ఉండే వారు ఫిట్‌నెస్ సాధించడానికి డ్యాన్స్ ప్రత్యామ్నాయంగా అవతరించింది. నగరంలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో నేమ్‌బోర్డుల్లో డ్యాన్స్‌కు అదనంగా‘ఫిట్‌నెస్’ జోడిస్తున్నారు. ఏరోబిక్స్‌ను ఒక వ్యాయామంగా కన్నా డ్యాన్స్ వర్కవుట్‌గానే చాలా మంది ఇప్పటికీ పరిగణిస్తున్నారు.
అధ్యయనాలు చెబుతున్న లాభాలు..
అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్‌సైజ్ ప్రకారం, జుంబా గంటకు 300–600 కేలరీల మధ్య బర్న్ చేయగలదు, ఇది ఉత్సాహంగా ఉంటూనే బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన మార్గం అని.. జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, డ్యాన్స్ కార్డియో హృదయనాళాల ఆరోగ్యంతోపాటు మొత్తం ఫిట్‌నెస్‌ను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
క్యాలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం. జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్‌లోని అధ్యయనం ప్రకారం, హిప్–హాప్ డ్యాన్స్ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది.
క్యాలరీలు కరుగుతున్నాయ్..
సుమారు 100కిలోల బరువున్న వ్యక్తి నిమిషం పాటు నృత్యం చేస్తే దాదాపు 1.4 క్యాలరీలు ఖర్చు అవుతాయి. 70కిలోల బరువున్న వ్యక్తి 20 నిమిషాలు నృత్యం చేస్తే దాదాపు 196 క్యాలరీలు ఖర్చు అవుతాయని, సావధానంగా చేయడం వల్ల 20 నిమిషాలకు 140 నుంచి 150 క్యాలరీలు, మధ్యస్థంగా చేయడం వల్ల 160 నుంచి 180 క్యాలరీలు, వేగంగా చేసే విధానం వల్ల 180 నుంచి 200 క్యాలరీలు ఖర్చవుతాయని ఓ పరిశోధన వెల్లడించింది.
ఈ డ్యాన్స్ వర్కవుట్స్‌ని వారంలో 2 నుంచి నాలుగు సార్లు తమ వ్యాయామ రొటీన్‌లో భాగంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. లాటిన్ అంతర్జాతీయ సంగీతాన్ని సరదా, ఉత్సాహభరిత నృత్య కదలికలతో మిళితం చేసే నృత్య వ్యాయామం జుంబా. ఇది వ్యాయామాన్ని డ్యాన్స్ పారీ్టగా మారుస్తుంది. దీని ద్వారా మనం వ్యాయామం చేస్తున్నామనే విషయం మర్చిపోయేలా ఇది రూపొందింది.
లాభాల నృత్యం..
ఫుట్ వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్పుతుంది.
రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
కొన్ని సైకలాజికల్, బిహేవియర్ సమస్యలకు నాన్ వెర్బల్ సైకోథెరపీగా పనిచేస్తుందని డాన్స్ థెరపిస్టులు అంటున్నారు.
డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్ వంటి సమస్యలను దూరంచేస్తుంది.
ఎముకల్లో క్యాల్షియం సమన్వయానికి, ఆస్టియోపొరోసిస్ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది.
లో బీపీ, అధిక కొలె్రస్టాల్ సమస్యలకూ సమాధానం ఈ డాన్స్.
కోర్ మజిల్స్ పటిష్టతకు సహకరిస్తుంది.
ఫీల్‌గుడ్ హార్మోన్ లైన అడ్రినలిన్, సెరొటోనిన్, ఎండారి్ఫన్‌ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.
బాడీ లాంగ్వేజ్ మెరుగుపరుస్తుంది.
కాళ్లు, హిప్ జాయింట్స్‌తో పాటు లోయర్ పార్ట్ మరింత దృఢత్వాన్ని సంతరించుకునేందుకు దోహదం చేస్తుంది.
డ్యాన్స్‌ఫ్లోర్.. పారా హుషార్..
చల్లని వాతావరణంలో నర్తించేటప్పుడు ముందుగా బాడీ వార్మప్ కావాల్సిందే. లేకపోతే గాయాలకు
కారణమవుతుంది.
బాల్‌రూమ్ ప్రాక్టీస్‌కు తగిన షూస్ ఎంపిక చేసుకోవాలి.
టర్న్ తిరిగేటప్పుడు అత్యుత్సాహం కూడదు. షోల్డర్ జాయింట్స్ మీద ఒత్తిడిని గమనించాలి.
సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణీత సమయంలో చేయడం మేలు.
ఒత్తిడిని జయిస్తుంది..
ఆరోగ్యసాధనకు ఉపకరించి పని ఒత్తిడిని దూరం చేస్తుంది నృత్యం. కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.. ‘కార్పొరేట్ ఉద్యోగుల్లో అత్యధికులు జంటగా చేసే సల్సా నృత్యం పట్ల మక్కువచూపుతున్నారు. చక్కని ఫిట్‌నెస్‌కు ఇదో మార్గమని వారు చెబుతున్నారు. కనీసం గంట పాటు చేసే నృత్యం 450 నుంచి 550 క్యాలరీలు ఖర్చవుతాయని స్పెషల్ డ్యాన్స్ ట్రైనింగ్ ప్యాకేజ్‌లు అందిస్తోన్న స్టెప్స్ అకాడమీ నిర్వహకులు పృధ్వీరాజ్ చెప్పారు.
డ్యాన్స్ మస్ట్.. లుక్ బెస్ట్..
‘బాగా డాన్స్ చేయడమంటే బాగా కని్పంచడమే’ అని ప్రసిద్ధ ఫిట్‌నెస్ శిక్షకురాలు దినాజ్ వర్వత్ వాలా సూత్రీకరించారు. సిటీలో ఇంటర్నేషనల్ డ్యాన్సింగ్ స్టైల్స్‌కు భారీగా ఆదరణ ఉంది. వీటిలో చిన్నారుల్ని బాలీవుడ్ డ్యాన్స్ స్టైల్స్ ఆకర్షిస్తుంటే.. టీనేజర్స్ హిప్–హాప్, వర్కింగ్ పీపుల్ సల్సాని లైక్ చేస్తున్నారని డ్యాన్స్ మాస్టర్ బాబీ చెబుతున్నారు.
హిప్–హాప్ డ్యాన్స్..
హిప్–హాప్ వర్కౌట్‌లు ఫిట్‌నెస్‌ను తాజా నత్య కదలికలతో కలపడానికి ఒక గొప్ప మార్గం. ఈ దినచర్య తరచూ బలం, చురుకుదనం, సమన్వయాన్ని కలిగి ఉంటాయి. ఉల్లాసమైన సంగీతాన్ని ఇష్టపడేవారి ఫిట్‌నెస్ దినచర్యకు కొంచెం చురుకుదనాన్ని జోడిస్తుంది హిప్–హాప్.
(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ)