పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? | Sakshi
Sakshi News home page

Parenting Tips: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి?

Published Sun, Apr 30 2023 8:00 AM

Common Parenting Mistakes to Avoid,how to More Effective Parenting - Sakshi

మూడేళ్ళ వయసులో పిల్లల్ని బడిలో చేర్పిస్తారు. అప్పటిదాకా , ఆ మాటకొస్తే ఆ తరువాత కూడా పిల్లల్ని పెంచడం లో చేయాల్సినవి .. చేయకూడనివి ఏంటి.? పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి.

1 . పిల్లల చేతికి ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఇవ్వొద్దు. అది వారి మెదడు ఎదుగుదలను దెబ్బ తీసి, వర్చ్యువల్ ఆటిజం (బుద్ధి మాంద్యత)ను కలిగిస్తుంది. సెల్ ఫోన్ కు అలవాటు పడిన పిల్లలకు మాటలు సరిగా రావు .

చికాకు , అసహనం , కోపం , హింసాప్రవృత్తి , తిరుగుబాటు ధోరణి... నెలల్లో వచ్చేస్తుంది . అటు పై సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్లి, వేలల్లో ఖర్చు పెట్టినా, ఫలితం దక్కక పోవచ్చు.

2. పిజ్జా బర్గర్ , కోక్ , పెప్సీ, ప్యాకెట్లలో దొరికే పొటాటో చిప్స్ లాంటి జంక్ ఫుడ్ కు పిల్లల్ని అసలు అలవాటు చేయకండి . చాకోలెట్లు, బిస్కెట్ లు లాంటివి కూడా ఎక్కువగా ఇవ్వొద్దు.

పళ్ళు , వేరుశనిగ గింజెలు , బెల్లం తో చేసిన చిక్కీలు (వేరుశనిగె చిక్కి ,నువ్వుల చిక్కి), డ్రై ఫ్రూట్ లడ్డు తాటి నుంజెలు , పొత్నాలు (శనిగెలు) బటానీలు లాంటి వాటిని చిరు తిళ్ళుగా అలవాటు చేయండి . ఆకుకూరలు కాయగూరలు బాగా తినేలా చూడండి . 3. పిల్లలు ఆకలి వేస్తె అన్నం తింటారు. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయకండి.

బాగా నమిలి తినేలా ప్రోత్సహించండి. 4 . ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి. మాటలు నేర్పించండి . దీనికి ఎంతో ఓర్పు - నేర్పు కావాలి . నిద్ర పోయేటప్పుడు తప్పించి వారితో, ఎవరో ఒకరు , ఎప్పుడూ, మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఎక్కువ వారితో మాట్లాడితే, వారి మెదడు (న్యూరల్ కనెక్షన్స్) అంత ఎక్కువ అభివృద్ధి చెందుతుంది.

5. మూడేళ్ళ లోపు, అంటే పిల్లలు బడికి వెళ్లేంత వరకు, ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలు ఉండాలి . వారు ఎప్పుడూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి . కేవలం భార్య- భర్త ఉన్న కేంద్రక కుటుంబాలలో పిల్లల ఎదుగుదల కుంటుబడుతుంది . నిజం నిష్ఠూరంగా ఉంటుంది . కానీ చెప్పక తప్పదు. తల్లి ఒక్కతే అస్తమానమూ, చంటి పిల్లలతో వ్యవహరించలేదు. మేలుకొన్నంత సేపు పిల్లలు , ముఖ్యంగా ఒకటి నుంచి మూడేళ్ళ లోపు పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వుంటారు.

తల్లి తాను చేస్తున్న పనికి లీవ్ పెట్టినా , ఇంత సమయం వెచ్చించ లేదు. బడికి వెళ్లే వయసు వచ్చే వరకు పిల్లలతో ఎవరో ఒకరిద్దరు తోడు ఉండాలి. వారు పిల్లలతో ఆడుతూ పాడుతూ మాట్లాడిస్తూ ఉండాలి . 6 . కదులుతున్నది , సౌండ్ వచ్చేది , రంగురంగుల్లో ఉండేది... ఇలాంటి వాటి పట్ల పిల్లలు సహజంగా ఆకర్షితులు అవుతారు.

ఇది మానవ పరిణామ క్రమంలో పిల్లలకు సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం. పిల్లల్ని వీలైనంత ఎక్కువగా బయటకు తీసుకొని వెళ్ళాలి . ఆకాశం , చందమామ , నక్షత్రాలు , పక్షులు జంతువులు ఇలా ప్రకృతికి , చుట్టూరా ఉన్న మానవ ప్రపంచానికి ... ఎక్సపోజ్ చెయ్యాలి. నాలుగు గోడలకే పరిమితం చేస్తే వారి బుద్ది వికాసం మందగిస్తుంది .

ఇంట్లో కదిలేది రంగురంగుల ను చూపేది సౌండ్ నిచ్చేది .. ఏది ? టీవీ . వారిని నాలుగు గోడలకు పరిమితం చేస్తే వారు ముందుగా టీవీకి, అటు పై సెల్ ఫోన్‌కు ఆకర్షితులు అవుతారు. ఈ కాలం పిల్లలు టెక్నాలజీ ని బాగా వాడేస్తారు అని మీరు మురిసి పోయే లోగా, వారికి సెల్ ఫోన్ అడిక్షన్ వచ్చేస్తుంది. ఆ తరువాత వారి జీవితం, మీ జీవితం నరకం.

6 . పిల్లలకు కథలు చెప్పండి . దీని వల్ల వారు మీ మాట వినడానికి చిన్నపటి నుంచే అలవాటు పడుతారు. కథల ద్వారా పిల్లల్లో క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్, సహానుభూతి లాంటి స్కిల్స్ పాదుగొలపవచ్చు. శ్రవణ, గ్రహణ శక్తి కూడా పెంపొందుతుంది .

లాలి పాటలు, జోల పాటలు పాడండి. చంటి బిడ్డ దగ్గర పాటలు పాడడానికి మీరేమీ సుశీల లేదా జానకి కానక్కర లేదు . ప్రతి తల్లిలో ఒక సుశీల, జానకి , లతా మంగేష్కర్ ఉన్నారు. తండ్రులు కూడా పాడొచ్చు. పిలల్లకు బెడ్ టైం స్టోరీస్ చెప్పొచ్చు . పిల్లల పెంపకం ఉమ్మడి భాద్యత . 7. చంటి పిల్లలు ముఖ్యంగా నడవడం నేర్చిన తరువాత, చుట్టూరా ఉన్న వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు . వాటిని తీసి పరిశీలించడం మొదలు పెడుతారు.

కరెంటు వైర్, ప్లగ్ లాంటి ముట్టుకోకూడని వస్తువులు తప్పించి మిగతా వస్తువులను వారిని ముట్టుకోనివ్వండి. పరిశీలించనివ్వండి . వస్తువులను ఎలా హ్యండిల్‌ చేయ్యాలో, ఏమి చేయకూడదో వివరించండి . ఉదాహరణకు గాజు గ్లాస్.. " ఆమ్మో ! కింద పడితే పగిలి పోతుంది " అని వారికి అర్థం అయ్యేలా చెప్పండి . కరెంటు వైర్ కన్నా ... గ్యాస్ స్టవ్ కన్నా... వారు ముట్టుకోకూడని డేంజరస్ వస్తువు ఒకటుంది . అదే సెల్ ఫోన్ . " ఇది పెద్దలకు మాత్రమే . నువ్వు అసలు తాకకూడదు" అని కచ్చితంగా చెప్పండి. నిక్కచ్చిగా వ్యవహరించండి.

8. నెమ్మదిగా రెండేళ్ల వయసు నుంచి వారికి పుస్తకాల పట్ల మక్కువ పెంచండి. ముందుగా బొమ్మల పుస్తకాలు. బొమ్మల్ని చూపుతూ దాని గురించి వారితో మాట్లాడండి . ఈ ఫర్ ఎలిఫెంట్ .. చెప్పండి. E..L..E..P..H..A..N..T అని వారికి స్పెల్లింగ్ నేర్పడం కాదు. పాయింట్లు బట్టి కొట్టించడం కాదు. ఏనుగు ఏనుగు నల్లంగా .. ఏనుగు కొమ్ములు తెల్లంగా అని పాట పాడడం .. ఏనుగు అడవిలో ఉంటుంది . అడవంటే ఏంటి ? ఇలా బాతాఖానీ టైపు లో మాటలు ఉండాలి.

పెద్ద వారు పక్కనున్న వారికి వినబడేలా కాస్త బిగ్గరగా పుస్తకాలు చదివితే మంచిదని, ఈ పద్దతి బిడ్డ గర్భం లో వున్నప్పుడే మొదలు కావాలని అమెరికన్ వైద్యులు గర్భిణీ స్త్రీలకు రెకమెండ్ చేస్తారు . 9 . పిల్లలు మనల్ని చూసి అనుకరిస్తారు . వారికెదురుగా బిగ్గరగా కొట్లాడుకోవడం , కోపం, అసహనం, ద్వేషం లాంటి నెగటివ్ ఎమోషన్స్ ను ప్రదర్శించడం , అదే పనిగా టీవీ చూడడం సెల్ ఫోన్ కు అంటుకొని ఉండడం లాంటివి చేయకూడదు.

10 . మీ ముద్దు మురిపెంతో పిల్లల్ని ఆటపట్టించడం , గేలి చెయ్యడం లాంటివి చెయ్యకండి . నవ్వుతూ వారితో సంయమనంతో వ్యవహరించండి. పిల్లల్ని పెంచడం ఒక కళ. ఒక సైన్స్ . పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు, గ్రామీణ జీవితాల వల్ల పైన చెప్పినవన్నీ సహజంగా జరిగి పోయేవి. నలభై లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి ఇలాగే ఎదిగాడు.

అది ప్రకృతి ధర్మం. మానవ శరీర నిర్మాణం ఇలాగే జరిగింది . జంక్ ఫుడ్ , వాటిని ప్రమోట్ చేసే సినీ హీరోలు, క్రికెటర్లు.. సెల్ ఫోన్ .. ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం .. ఇదీ నేటి పిల్లల పెంపకం లో ఎదురయ్యే సవాళ్లు . సరైన రీతిలో పిల్లల్ని పెంచితే అదే కోట్ల ఆస్తి. ఇంట్లో బిడ్డ వర్చ్యువల్ ఆటిజం తో నో ADHD తో నో బాధ పడుతుంటే కోట్ల ఆస్తి ఉన్నా జీవితం నరకం . తస్మాత్ జాగ్రత్త.

వాసిరెడ్డి అమర్‌నాథ్‌,
విద్యావేత్త, మానసిక పరిశోధకులు

Advertisement
 
Advertisement
 
Advertisement