మాట్లాడండి పిల్లలతో

childrens fears around returning to school reopen - Sakshi

స్కూలుకు వెళ్లడం మొదలెట్టిన పిల్లలతో మాట్లాడండి అంతా సరిగ్గా ఉందా అని. స్కూలుకు వెళ్లబోతున్న పిల్లలతో మాట్లాడండి... అంతా సరిగ్గా ఉండబోతోందని. చాన్నాళ్ల తర్వాత స్కూలుకు వచ్చిన పిల్లలతో టీచర్లు మాట్లాడండి ఇంట్లో ఎలాంటి వొత్తిళ్ల మధ్య రోజులు గడిచాయోనని. పిల్లలకు ఇప్పుడు మాటలు అవసరం. ఏ మాటలు లేక వాళ్లు ఇళ్లల్లో చాలా కాలంగా మూగబోయి ఉన్నారు. భయాలు సందేహాలు మూటగట్టుకుని ఉన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు వారితో ఎంత మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు.

కొందరు పిల్లలకు కోవిడ్‌ అంటే భయం లేదు. కొందరు పిల్లలకు కోవిడ్‌ అంటే ఇంకా భయం పోలేదు. వీరు రోజంతా మాస్క్‌లు పెట్టుకుని క్లాసుల్లో కూచోవడం ఎంత సాధ్యమో ఈ పిల్లలకే తెలియదు. క్లాసులో దూరం కూచున్నా బ్రేక్‌ టైమ్‌లో లంచ్‌ టైమ్‌లో ఒకరితో ఒకరు దగ్గరగా కూడకుండా ఈ పిల్లలు ఉండలేరు. ఆడుకోవడానికి పరిగెత్తకుండా ఉండలేరు. అయితే ఆ రోజులు మళ్లీ వస్తాయి. మరి కొన్నాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈ పిల్లలతో పదే పదే మాట్లాడాల్సి ఉంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌ క్లాసులు మిస్సయిన పిల్లలు చదువులో వెనకబడినా, ఇప్పటికిప్పుడు పుంజుకోకపోయినా ‘మరేం పర్వాలేదు.

మెల్ల మెల్లగా అన్నీ చదువుకో’ అని తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టనని హామీ ఇవ్వాల్సి ఉంది. టీచర్లు కూడా పరీక్షలు, మార్కులు అంటూ వారిని న్యూనత పరచమని చెప్పాల్సి ఉంది. చాలా మంది పిల్లలు ఒక సంవత్సర కాలంగా తమ మనసులో గూడు కట్టుకుపోయిన విషయాలను తమ స్నేహితులతో పంచుకోవాలనుకుంటారు. హైపర్‌ యాక్టివ్‌ అయ్యే అవకాశం ఉంది. వారిని అర్థం చేసుకునే విధంగా తమ తీరు ఉంటుందని టీచర్లు వారికి చెప్పాల్సి ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా కోవిడ్‌ పట్ల ఎక్కువ భయం కాని తక్కువ భయం కాని కల్పించకుండా ఇది అందరు కలిసి సమర్థంగా ఎదుర్కొనగలిగిన మహమ్మారి అని వారిలో ధైర్యం నింప గలగాలి. అందుకూ మాట్లాడాలి.

ఇప్పుడు పిల్లలు మొదలెడుతున్నది కొత్త చదువు. టీచర్లు చెప్పాల్సింది తల్లిదండ్రులు ఆశించాల్సింది కూడా కొత్త చదువే. మార్కులు, గ్రేడ్లు కన్నా పాఠాలు, స్నేహాలు, నవ్వులు, దూరం దూరంగా ఆడదగ్గ ఆటలు, వొత్తిడి లేని క్లాస్‌రూమ్‌లు, ఊరడించే కథలు ... ఇవి ఇప్పటి అవసరమని, స్కూలు అలాగే ఉంటుందని టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. ప్రమాదం గడిచిపోయే వరకు పిల్లలకు స్కూలు ఒక సురక్షితమైన ప్రేమ పూర్వక అమ్మ ఒడి అని అర్థం చేయించ గలిగితే పిల్లలు నిజమైన వికాసం పొందుతారు.  

కేస్‌ 1
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పల్లెటూరులో ఎనిమిదవ తరగతి విద్యార్థి వేణు (అసలు పేరు కాదు) లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఉండిపోయాడు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక స్కూలు తెరిచే పరిస్థితి రానందున తండ్రి పని చేసే చోటుకు ఆయనతో వెళ్లి కాలక్షేపం చేసేవాడు. తండ్రికి సాయం చేసేవాడు. మధ్యలో పుస్తకాలు చూడటం, టీవీ క్లాసులు వినడం అంతగా చేయలేదు. ఇప్పుడు స్కూళ్లు తెరిచారు. కాని స్కూలుకు రావాలంటే జంకు. పాఠాలు ఏమాత్రం చదవగలననే జంకు. మళ్లీ ఒక క్రమశిక్షణకు రావడం పట్ల జంకు. 

కాని తల్లిదండ్రులు వేణును తప్పనిసరిగా చదువులో పెట్టాలనుకున్నారు. స్కూలుకు తీసుకొచ్చి ‘నాడు నేడు’ వల్ల వచ్చిన కొత్త హంగులను చూపించారు. పుస్తకాలు యూనిఫామ్‌లు బూట్లు స్కూల్‌ నుంచి ఇప్పించి ఉత్సాహపరిచారు. టీచర్లతో మాట్లాడించారు. సిలబస్‌ తక్కువగా ఉంటుందని, మళ్లీ కొన్ని బేసిక్స్‌ చెప్పి పాఠాలు చెప్తామని టీచర్లు చెప్పారు. వేణుకు మెల్లగా ధైర్యం పుంజుకుంది. స్కూలుకు రావడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు, టీచర్లు ఇలాంటి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇంకా స్కూలుకు రావాల్సిన ‘వేణు’లు అక్కడక్కడా కొద్దిమంది ఉన్నారు. వారితో మాట్లాడాల్సి ఉంది.

కేస్‌ 2
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పెద్ద టౌన్‌లో ప్రయివేటు స్కూల్‌లో లత (పేరు మార్పు) ఇప్పుడు తొమ్మిదో తరగతికి హాజరు కావాలి. లతకు స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు కోవిడ్‌ బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలో ఆమె భయపడింది. అదీగాక రోజూ న్యూస్‌లో థర్డ్‌ వేవ్‌ గురించి వింటోంది. అదీ ఒక భయమే. కాని ఇన్నాళ్లూ స్కూల్‌ లేక ఇంట్లోనే ఉండిపోతున్న లత మెల్లగా డల్‌ అయిపోవడం గమనించిన తల్లిదండ్రులు కోవిడ్‌ జాగ్రత్తలతో లతను స్కూలు పంపించాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు.

టీచర్లతోనూ చెప్పించారు. కాని లత తొలి రోజు స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చేసింది. ఆమెకు ఆ స్కూల్‌లో ఇష్టమైన ఇద్దరు ముగ్గురు టీచర్లు ఇప్పుడు లేరు. మానేశారు. క్లాస్‌లో కూడా మునపటిలా ఫ్రెండ్స్‌తో దగ్గర దగ్గరగా కూచునే వీలు లేదు. ఇదంతా లతకు నచ్చలేదు. కాని ఈ పరిస్థితి కొన్నాళ్లే ఉంటుందని, క్లాస్‌రూమ్‌లో ఫ్రెండ్స్‌ను దూరం నుంచైనా చూసి మాట్లాడటం మంచిదని, పాత టీచర్లు వెళ్లి కొత్త టీచర్లు వచ్చినా వారు కూడా మెల్లగా నచ్చుతారని లతకు చెప్పాల్సి ఉంది. ఆ అమ్మాయితో ఇంకా మాట్లాడాల్సి ఉంది.

కేస్‌ 3
హైదరాబాద్‌లో ఒక పేరున్న ప్రయివేట్‌ స్కూల్‌లో చదువుతున్న కౌశిక్‌ (పేరు మార్పు) సెవన్త్‌ క్లాస్‌ పాఠాలను ఆ స్కూల్‌ టంచన్‌గా నడిపిన ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా వింటూ వచ్చాడు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో సెప్టెంబర్‌ 1 నుంచి స్కూల్‌కు హాజరయ్యి వినాలనే సరికి డల్‌ అయిపోయాడు. ‘నేను స్కూల్‌కి పోను. కోవిడ్‌ ఉంది’ అంటున్నాడు తల్లిదండ్రులతో. అసలు కారణం వేరే ఉంది. కౌశిక్‌ కెమెరా ఆఫ్‌లో పెట్టి మధ్య మధ్యలో యూ ట్యూబ్‌ చూసుకోవడం, గేమ్స్‌ ఆడుకోవడం, ఎగ్జామ్స్‌ కూడా తల్లిదండ్రులను అడిగి రాయడం, ఒక్కోసారి సోఫాలో పడుకుని హెడ్‌ఫోన్స్‌ ద్వారా పాఠాలు వినడం... వీటికి అలవాటు పడ్డాడు.

ఇవన్నీ స్కూల్‌కు వెళితే ఉండవు. టీచర్లు కెమెరాలో కనపడితే పెద్ద భయం ఉండదు. నేరుగా కనపడితే వారిని నిజంగా ఫేస్‌ చేయాలి. గతంలో లేని భయం ఇప్పుడు కొత్తగా పట్టుకుంది. కౌశిక్‌తో తల్లిదండ్రులు ఇంకా ఏం మాట్లాడలేదు. ‘ఏయ్‌.. నువ్వు స్కూల్‌కు వెళ్లాల్సిందే’ అంటున్నారు. టీచర్లు కూడా స్కూల్‌కు రావాల్సిందే అంటున్నారు. కౌశిక్‌ను ఆన్‌లైన్‌ విద్యార్థి నుంచి ఆఫ్‌లైన్‌ విద్యార్థిగా మార్చడానికి మాట్లాల్సింది. మాట్లాడాల్సిన అవసరాన్నే ఇరుపక్షాలు ఇంకా గుర్తించడం లేదు.

‘స్కూల్‌ ఫోబియా’ పోగొట్టాలి
గతంలో ‘ఎగ్జామినేషన్‌ ఫోబియా’ వినేవాళ్లం. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత స్కూల్‌కు వెళ్లాల్సి రావడం వల్ల పిల్లల్లో స్కూల్‌ ఫోబియా కనిపించవచ్చు. వాళ్లు ఇన్నాళ్లు హాయిగా హాలిడేస్‌ గడిపి స్కూల్‌కు వెళుతున్నారనే ఆలోచన పేరెంట్స్‌ తీసేయాలి. వారి స్ట్రెస్‌ వారు అనుభవించి మళ్లీ కొత్తగా స్కూల్‌లో అడుగుపెడుతున్నారు. 6 నుంచి 8 వారాల కాలం వారు అడ్జస్ట్‌ కావడానికి పడుతుంది. ఈ కోవిడ్‌ సందర్భంలో తేలిక వాతావరణం లో ఉంచుతూ పాఠాల్లోకి తీసుకెళ్లాలి. ఏ సమస్య వచ్చినా మనసు విప్పి చెప్పుకోమని తల్లిదండ్రులు, టీచర్లు భరోసా ఇవ్వాల్సిన అసలైన సమయం ఇది. టీచర్లు కాని తల్లిదండ్రులు కాని స్నేహపూర్వకంగా ఉంటామని హామీ ఇస్తేనే ఈ కాలంలో పిల్లలు మునుపటి ఉత్సాహం నింపుకుంటారు.

– డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top