హిమాలయాల ఒడిలో సాగే చార్‌ధామ్‌ యాత్ర! | Char Dham Yatra Highlights Between Uttarakhand And Garhwal | Sakshi
Sakshi News home page

హిమాలయాల ఒడిలో సాగే చార్‌ధామ్‌ యాత్ర!

Jun 1 2026 9:15 AM | Updated on Jun 1 2026 9:17 AM

Char Dham Yatra Highlights Between Uttarakhand And Garhwal

పర్యటన : చార్‌ధామ్‌ యాత్ర

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ 

హిమాలయ శిఖరాల నుంచి జారే మంచు బిందువులను చూస్తూ గంటానాదాల మధ్య పరవశించి పోయే దివ్యక్షేత్రాల ప్రయాణమే ఉత్తరాఖండ్‌ గర్వాల్‌ పర్వతాల మధ్య సాగే చార్‌ ధామ్‌ యాత్ర. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బదిరీనాథ్‌.. ఈ నాలుగు క్షేత్రాలను కలుపుతూ చేసే యాత్ర చార్‌ధామ్‌.

ప్రతి మనిషి తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే  ఈ నాలుగు పవిత్ర స్థలాల దర్శనం కేవలం తీర్థయాత్ర మాత్రమే కాదు. అది ఒక ఆధ్యాత్మిక సంచారం. ప్రశాంతంగా సాగే ఈ యాత్ర  మనసులోని అలజడి మొత్తాన్ని దూరం చేసి కొత్త ప్రశాంతతను చోటు ఇస్తుంది.

చల్లని గాలులు మేనిని తాకుతుండగా, మబ్బుల మధ్య నుంచి కనిపించే పర్వతాల అందాలు చూస్తుంటే ప్రకృతి తన సహజ అందాలను చూపుతున్నట్టుగా  ఉంటుంది.

హిమాలయాల ఒడిలో సాగే చార్‌ధామ్‌ యాత్ర ఆధునిక ప్రపంచ అలజడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతుంది. మొదటి ఘట్టం యమునోత్రి దగ్గర మట్టి వాసనలతో మొదలై మనసుకు హాయిని ఇస్తుంది. తరువాత గంగోత్రి క్షేత్రానికి వెళ్లే దారి ΄÷డవునా ఉన్న చెట్ల వరుసలు, భగీరథి నది జోరుగా సాగే ప్రవాహం చూస్తుంటే ప్రకృతి తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

కేదార్‌నాథ్‌ చేరగానే చుట్టూ ఉన్న మంచు పర్వతాల మధ్య గుడి గోపురం వెనుక కనిపించే శిఖరాలు భక్తి భావంతో పాటు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. చివరగా అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రినాథ్‌ క్షేత్రాన్ని చూస్తుంటే యాత్రకు ఒక పరిపూర్ణత వచ్చినట్టుగా అనిపిస్తుంది. క్షేత్రాల చుట్టూ ఉండే చిన్న చిన్న గ్రామాలు, పర్వతాల అందాలు ఈ ఆధ్యాత్మిక యాత్రకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి.


చేయాల్సిన పనులు..

  • జానకి చట్టి నుంచి యమునోత్రి వరకు ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రకృతితో చేసే మౌన సంభాషణను ఆస్వాదించవచ్చు.

  • గంగోత్రిలో భగీరథి నది నీటిని స్పర్శించి ఆ పవిత్రతను అనుభవించవచ్చు.

  • గౌరీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు సాగే ప్రయాణంలో తోటి యాత్రికుల భక్తి స్వరాలు వింటూ ట్రెక్కింగ్‌ లేదా గుర్రంపై ప్రయాణించవచ్చు.

  • బద్రినాథ్‌ దర్శనం తరువాత తప్త కుండ్‌లో స్నానం చేసి ఆ వేడి నీటి హాయినీ ఆస్వాదించవచ్చు.

  • మానా గ్రామంలో తిరుగుతూ అక్కడి స్థానిక స్థల పురాణాలను తెలుసుకోవచ్చు.

ఆసక్తికరమైన విషయాలు..

  • ట్రెడిషన్‌ ప్రకారం చార్‌ ధామ్‌ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌తో ముగుస్తుంది.

  • ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ లేదా మే నుంచి అక్టోబర్‌ వరకు ఓపెన్‌ ఉంటుంది.

  • కేదార్‌నాథ్‌ చేరడానికి గౌరీకుండ్‌ నుంచి సుమారు 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.

  • మానా గ్రామం భారతదేశంలోని చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది.

  • యాత్రకు ముందు ఉత్తరాఖండ్‌ పోర్టల్‌లో అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి.


ఎక్కడ ఉండాలి?
యాత్ర సాగే ప్రతి చోట హోటల్స్, ధర్మశాలల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్వాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ గెస్ట్‌ హౌస్‌లు కానీ, కొండ అంచున ఉన్న చిన్న కాటేజీలు కానీ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. హడావిడి లేని వాతావరణం, ఎటు చూసినా కనిపించే పర్వతాల దృశ్యాలు, ఉదయాన్నే వీచే చల్లని గాలిని ఆస్వాదిస్తూ పర్వతాల మధ్య కూర్చోవడం ఒక మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. పెద్ద పెద్ద విలాసాలు లేకపోయినా ఇక్కడ ప్రతి లాడ్జిలో దొరికే అతిథ్యం, చుట్టూ ఉన్న ప్రకృతి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. కొండ గాలిలో కలిసిన ఆ మౌనాన్ని ఆస్వాదించడం చార్‌ ధామ్‌ యాత్ర ప్రత్యేకత.

ఏం చూడాలి?
పర్వతాల వెనుక నుంచి మెల్లిగా ఉదయించే సూర్యుడు, సాయంత్రం వేళ నదుల దగ్గర జరిగే హారతి దృశ్యాలు తప్పకుండా చూడాలి. కేదార్‌నాథ్‌ దగ్గర మందాకిని నది ప్రవాహం మధ్య నిలబడితే ప్రకృతితో కలిసి ఒక పాట పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బద్రినాథ్‌లోని తప్త్‌ కుండ్‌లో వేడి నీటి స్నానం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా హాయిని ఇస్తుంది.

భారతదేశంలోని చివరి గ్రామంగా పిలువబడే మానా గ్రామంలో నడుస్తుంటే ఒక కొత్త ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గంగా, యమునా నదుల ఉద్భవ స్థలాలను చూస్తుంటే మనసులోని ఆలోచనలు కూడా ప్రశాంతంగా మారిపోతాయి. రాత్రివేళ మంచు కప్పిన పర్వతాల మధ్య చుక్కలతో నిండిన ఆకాశం అద్భుతమైన విజువల్‌ ట్రీట్‌లా కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలి?

  • ఈ పవిత్ర యాత్రను హైదరాబాద్‌ నుంచి ప్రారంభించాలంటే ముందుగా దెహ్రాడూన్‌ లేదా ఢిల్లీకి ఫ్లైట్‌ లేదా ట్రైన్‌ ద్వారా చేరుకుని అక్కడి నుంచి హరిద్వార్‌ వైపు ప్రయాణం సాగించాలి. విజయవాడ నుంచి వచ్చిన వారికి కూడా ఢిల్లీ కనెక్టివిటీ సులభంగా లభిస్తుంది.

  • హరిద్వార్‌ నుంచి పర్వత దారుల్లో బస్‌ లేదా ట్యాక్సీలో సాగే ప్రయాణంలో ఒకవైపు లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే కొండలు కనిపిస్తాయి. కొండలపై మబ్బుల తెరలు దాటుకుంటూ, చల్లని గాలుల స్పర్శను ఆస్వాదిస్తూ సాగే ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోతుంది.


ఏం తినాలి?
ఈ కొండప్రాంతాల్లో దొరికే వేడి వేడి ఆలూ పరాటా, పహాడి దాల్‌ చావల్‌తో పాటు గరం చాయ్‌ ప్రయాణంలో మరో అందమైన భాగంగా అనిపిస్తాయి. లోకల్‌గా తయారు చేసే జొన్న రొట్టెతో పాటు పహాడి కర్రీ రుచి మరిచిపోలేనిదిగా ఉంటుంది. ప్రతి గుడి దగ్గర దొరికే ప్రసాదంలో ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించవచ్చు. చల్లని వాతావరణంలో వేడి వేడి జిలేబీ తినడం, స్వచ్ఛమైన కొండ నీటితో తయారైన వంటలను ఆస్వాదించడం ఈ యాత్రను మరింత మధురంగా మారుస్తాయి.

యాత్ర బడ్జెట్‌ వివరాలు..

  • చార్‌ధామ్‌ యాత్ర మొత్తంగా పూర్తి చేయడానికి సాధారణంగా 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. హైదరాబాద్‌ నుంచి దెహ్రాడూన్‌ వరకు ఫ్లైట్‌ లేదా ట్రైన్‌ ద్వారా చేరుకోవచ్చు.

  • స్టాండర్డ్‌ గ్రూప్‌ ΄్యాకేజీల ప్రకారం ఒక్కరికి సుమారు రూ.25 వేల నుంచి రూ.45 వేల మధ్య బడ్జెట్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్‌ క్యాబ్‌ లేదా ప్రీమియం ΄్యాకేజీలు తీసుకుంటే ఈ ఖర్చు రూ.55 వేల నుంచి రూ.75 వేల వరకు 
    పెరగవచ్చు.

  • స్టే కోసం ప్రతి రాత్రి రూ.1000 నుంచి రూ.3500 మధ్య మంచి రూమ్స్‌ లభిస్తాయి. ఫుడ్‌ కోసం ప్రతి రోజు రూ.400 నుంచి రూ.600 మధ్య వెజిటేరియన్‌ ఫుడ్‌ లభిస్తుంది.

  • హెలికాప్టర్‌ సర్వీస్‌ ఉపయోగించాలనుకుంటే ముందుగానే బుకింగ్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సీజన్‌ సమయంలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

గమనిక : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్‌ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. ప్రయాణానికి ముందు తాజా అప్‌డేట్స్‌ వెరిఫై చేసుకుని యాత్రను ΄్లాన్‌ చేసుకోవడం మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement