పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి

Chaganti Koteswara Rao On Jayadevudu Who Is Krishna Devotee - Sakshi

మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణభక్తుడు. ఒడిశా రాష్ట్రంలోని కెంధు బిల్వా అనే ప్రదేశంలో భోజదేవుడు, రమాదేవి అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి. 8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి. ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట. భక్తులందరూ ఆయన పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు. 

ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు. ఒక సన్నివేశంలో–‘‘ ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి మండనం దేహిపదపల్లవ ఉదారం...’’ అని రాశాడు. అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది. వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు.

రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు.. అనడు. అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి– ‘‘పద్మావతీ! స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..’ అని చెప్పి అభ్యంజనానికి బయల్దేరాడు. అభ్యంజనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం. ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు...‘‘అదేమిటి మళ్ళీ వచ్చారు?’ అని పద్మావతీ దేవి అడిగితే ..‘‘అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది. ..’ అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు. 

కొంతసేపటి తరువాత నదీస్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు. తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. ‘‘పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?’’ అని అడిగాడు. దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..’’ అంది. ‘‘పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. వచ్చింది నేను కాదు. ఆ పరమాత్మ. స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయాడు. ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు’’ అన్నాడు. అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు. అవి అలా వింటూ ఉంటే స్వామి ప్రసన్నుడౌతాడని వారి నమ్మకం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top