
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్‌లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.
కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్‌కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్‌కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్‌కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్‌తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.
మహిళాశక్తి క్యాంటీన్
డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్‌లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.
ఆమె విజయపథం... ఎగ్జిబిషన్‌లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్‌లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్‌లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.
డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
చిన్న రైతులే
నా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్‌నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్‌కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్‌లో నిన్న తయారైన మెటీరియల్‌ను ఈ రోజున కౌంటర్‌లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్‌తోపాటు యూనిట్‌లోనే అవుట్‌లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.
నా సక్సెస్‌కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్‌కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్‌కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.
– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్