ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులకు రెస్ట్ మస్ట్ కాదంటున్నారు..అయితే చాలా మంది తెలియక అదే పనిగా రెస్ట్ తీసుకుంటున్నారని, తద్వారా నగరంలో 60.7 శాతం సీ–సెక్షన్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, 98 శాతం మందికి అసలు బెడ్ రెస్ట్ అవసరం ఉండదని, పూర్తిగా రెస్ట్‌తోనే సీ సెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. నగరంలో సీ–సెక్షన్లు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ హెల్త్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై పలు సూచనలు..
అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి మొదటిసారి తల్లికాబోతోందని తెలియగానే విపరీతమైన ముద్దుచేస్తారు. చిన్నపనికూడా చేయనీయరు. అయితే అలాంటి పరిస్థితులు మానసికంగా, శారీరకంగా గర్భిణిపై ప్రభావం చూపిస్తాయని, ఇది సీ–సెక్షన్ల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
సర్వే చెబుతోందేంటి?
నగరంలోని ప్రసవాల్లో సుమారు 60.7 శాతం సీ–సెక్షన్లు ఉంటున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇది దేశంలోనే అత్యధిక రేటుగా పేర్కొంటోంది. గర్భనిర్ధారణ అయిన వెంటనే అధిక శాతం మంది వైద్యులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో సుమారు 98 శాతం మంది గర్భిణులకు బెడ్ రెస్ట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ బర్త్ కెనాల్ వీక్‌గా ఉన్నప్పుడు లేదా కుట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తారని, మిగతా సమయంలో అవసరం లేదని అంటున్నారు.
ఫార్మేషన్‌లో తేడాలుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మిస్ క్యారీ అవుతుంది తప్ప, దినచర్య వల్ల ప్రమాదమనేది అపోహ మాత్రమే అంటున్నారు. గర్భిణులు నేను మెట్లు ఎక్కొచ్చా? నేల మీద కూర్చోవచ్చా? పనులు చేసుకోవచ్చా? అని ప్రశి్నస్తుంటారని, గర్భందాల్చడం జబ్బు కాదని, ఫిజియోలాజికల్ మార్పు మాత్రమేనని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరగడానికి శారీరక వ్యాయామం ఒక కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
బెడ్ రెస్ట్‌తో కొత్త సమస్యలు..
గర్భిణులు తొమ్మిదో నెల వరకూ అన్ని పనులూ చేసుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే బెడ్ రెస్ట్ అవసరపడుతుంది. సుమారు 98 శాతం మందికి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఒక్కసారిగా పనులన్నీ పక్కన పెట్టి బెడ్ రెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మూడు నెల్లలోపు పిండం సుమారు 80 గ్రాములు మాత్రమే ఉంటుంది. కవలలు, ఐవీఎఫ్, ఏఆర్ ఇతర సందర్భాల్లో మాత్రమే జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణి ఒంటరితనం, స్ట్రెస్ ఫీలవకుండా చూసుకోవాలి.
– పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్
(చదవండి: World Stroke Day 2025: లైఫ్‌స్టైల్ మార్పులే..స్ట్రోక్ కారకాలు..!)


