గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో స్ట్రోక్‌కు గురయ్యేవారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 15 నుంచి 20 శాతం మంది 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉంటున్నారని నిపుణులు అంటున్నారు. దేశంలో ఏటా 1.5 నుండి 1.8 మిలియన్ల స్ట్రోక్ కేసులు నమోదవుతుంటే, తెలుగు రాష్ట్రాలలో 1,00,000 జనాభాకు 275 మందిలో స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా. మారుతున్న జీవనశైలి,దీనికి ప్రధాన కారణంగా వైద్యులు అంటున్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్న ఐటీ, వృత్తి నిపుణులు నిద్రలేమితో బాధపడుతున్నారు. నగర వాసుల్లో పెరిగిన స్క్రీన్ సమయం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తోందని, క్రమరహిత నిద్ర విధానాలు వాసు్కలర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఆహారపు అలవాట్లతో మధుమేహం, ప్రాసెస్డ్ ఫుడ్ రక్తపోటు తదితర వ్యాధుల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. మహిళలతో పోలిస్తే మగవారిలో స్ట్రోక్ ఎక్కువ సంభవించే అవకాశం ఉందని ఇటీవల గుర్తించారు. దేశంలో మరణానికి రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా కూడా గణాంకాలు చెబుతున్నాయి.
సమయమే కీలకం..
ఈ స్ట్రోక్‌కు గురైన సందర్భంలో మెదడును కాపాడటానికి సమయం చాలా ముఖ్యం. ఆస్పత్రి చేరుకోవడంలో ఆలస్యం అతిపెద్ద సవాలు. ‘స్ట్రోక్, వైకల్యాలకు మధ్య అతిపెద్ద వ్యత్యాసం సమయం. స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం, రెండు మిలియన్ల మెదడు కణాలు చనిపోతాయి’ అని వైద్యులు వివరిస్తున్నారు. ‘మూడు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోవడం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని చెబుతున్నారు. దీనిని ఎదుర్కోడానికి, ఈ సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డే థీమ్ ‘ప్రతి నిమిషం లెక్కించబడుతుంది’ అని ఎంచుకున్నారు.
‘రిహాబ్’తో సాధారణ జీవితం..
వంశపారంపర్య సమస్యలతో అత్యంత పిన్న వయసు్కలు కూడా స్ట్రోక్ బాధితులుగా మారడం ఇటీవల గమనిస్తున్నాం. జీవనశైలి మార్పుల వల్ల యుక్త వయసు్కలు దీని బారిన పడుతున్నారు. స్ట్రోక్ చికిత్స తర్వాత రికవరీ కీలక అంశం. అది సవ్యంగా అందితేనే రోగి తిరిగి సాధారణ జీవితం గడపగలుగుతాడు. స్ట్రోక్ బాధితుల కోసం దశాబ్ధం క్రితమే ‘రిహాబ్’ కేంద్రాలు ప్రారంభించాం. దేశవ్యాప్తంగా 7 సెంటర్స్ నిర్వహిస్తున్నాం. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, రోబోటిక్ పరిజ్ఞానంతో శరవేగంగా రోగుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
– డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్– డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్ కేర్ ఎట్ హోమ్ కేర్ ఎట్ హోమ్
లక్షణాలు ముందుగా గుర్తిస్తే మేలు..
ఇటీవల కాలంలో స్ట్రోక్ సాధారణ న్యూరోలాజికల్ వ్యాధిగా మారింది. ముఖ్యంగా ముఖం వంకరపోవడం, చేతి బలం తగ్గడం, ఒక చేతిని పైకి లేపడానికి కష్టపడటం. మాటల్లోనూ తడబాటు, అకస్మాత్తుగా కళ్లు మసకబారడం, తీవ్ర తలనొప్పి, శరీర సమతుల్యం కోల్పోవడం వంటివి స్ట్రోక్ లక్షణాలు. వీటిపై మరింత అవగాహన అవసరం.
– డాక్టర్ వంశీకృష్ణ, న్యూరోసర్జన్, నిమ్స్ ఆస్పత్రి


