
‘చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటను నిజం చేశాడు కర్ణాటక, హరెలహళ్లికి చెందిన అంకే గౌడ. ఇప్పుడతని వయసు 75 ఏళ్లు. పుస్తకాలను కొని చదివి, భద్రం చేసే పనిని తన 20వ ఏట మొదలుపెట్టాడు. ఇప్పటివరకు పోగైన రెండు కోట్ల పుస్తకాలతో ‘బుక్ మానే (బుక్ హౌజ్)’ పేరుతో ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేసి.. దాన్నే తన నివాసంగా మలుచుకున్నాడు.
కండక్టర్.. బుక్ కలెక్టర్
అంకే గౌడ్ ఓ వైపు కన్నడ సాహిత్యంలో పీజీ చదువుతూనే మరో వైపు బస్ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాడు. చిన్నప్పటి నుంచీ పుస్తకం పఠనం మీద ఆసక్తి మెండు. దానికి కాలేజీలో తన ప్రొఫెసర్ అనంతరాము ప్రభావం, స్ఫూర్తీ తోడవడంతో పుస్తకాలను కొనడమూ మొదలుపెట్టాడు. కండక్టర్‌గా తనకొచ్చే జీతంలో ముప్పావుభాగం పుస్తకాల కొనుగోలు మీదే వెచ్చించేవాడు. పెళ్లయి, పిల్లాడు పుట్టి బాధ్యతలు పెరిగినా ఇంటి ఖర్చులను తగ్గించుకునేవాడు కానీ పుస్తకాల బడ్జెట్‌లో కోత పెట్టేవాడు కాదు.
అతని ఆ ఆసక్తిని, అలవాటును సహధర్మచారిణి విజయలక్ష్మి గౌరవించి.. ఉన్నదాంట్లోనే పొదుపుగా సంసారం చేయసాగింది. చివరకు తనకు నచ్చిన, లోకం మెచ్చిన పుస్తకాలను కొనడానికి అంకే గౌడ .. మైసూరులోని తమ ఇంటిని అమ్మినా మారుమాట్లాడకుండా భర్తను అనుసరించింది ఆమె. ప్రస్తుతం ‘బుక్ మానే’లోనే ఓ మూల ఆ కుటుంబం నివాసముంటోంది.
అందరికీ ఉచితం
1832 నాటి రాతప్రతులు సహా దేశ, విదేశీ భాషలన్నిటిలోని అరుదైన సాహిత్యం అంకే గౌడ ‘బుక్ మానే’లో కనిపిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, మైథాలజీ, ఫిలాసఫీలకు సంబంధించిన పుస్తకాలూ దొరుకుతాయి. ఈ లైబ్రరీకి ఎవరైనా వెళ్లి కావల్సిన పుస్తకాలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ప్రవేశ రుసుము కానీ, పుస్తకానికి అద్దె కానీ లేదు.
పూర్తిగా ఉచితం. బడి పిల్లలు, రీసెర్చ్ స్కాలర్స్, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అవుతున్నవాళ్లు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు ఈ లైబ్రరీకి రెగ్యులర్ విజిటర్స్. పర్యాటకుల గురించైతే విడిగా చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో ‘బుక్ మానే’ను చూడ్డానికి వస్తూంటారు. ‘పుస్తక పఠనం మీద ఆసక్తి, జ్ఞానతృష్ణ ఉన్న ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వచ్చి తమకు కావల్సింది చదువుకోగలిగేలా ఈ లైబ్రరీని మలచాలి.. ఓ నాలెడ్జ్ హబ్‌గా మార్చాలన్నదే నా కల, భవిష్యత్ లక్ష్యం’ అంటాడు అంకే గౌడ.
(చదవండి: సరదా సరదా దొంగతనాలు: క్లెప్టోమేనియా!)