
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్‌పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్‌ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.
అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్‌కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్‌లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది.
తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్‌నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్‌ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె.
భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్‌లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది.
ఆమె పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్‌లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్‌కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..)