తాడేపల్లిగూడెం (టీఓసీ): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సమస్యలను అధికారుల సహా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైతే కార్మిక శాఖకు నివేదిస్తామని ఏఐటీయూసీ నాయకులు హామీ ఇచ్చారు. వర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ పలు శాఖల్లో ఏళ్లకు తరబడి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిన పని చేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించకపోగా, కనీస వేతనాలు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే వేతనాలను కూడా నెలల తరబడి బకాయి పెడుతున్నారని విమర్శించారు. అప్కాస్ పరిధిలోని సిబ్బందిని కాంట్రాక్ట్‌లోకి మార్చడంతో వేతనాలు తగ్గిపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటుం నాగేశ్వరరావు, సిద్ధాబత్తుల కృష్ణారావు, ఏఐటీయూసీ నాయకులు ఓసూరి వీర్రాజు, కళింగ లక్ష్మణరావు, మండలపర్తి హరీష్, తాడికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


