మాతా, శిశు మరణాలపై ‘డెత్ ఆడిట్’ తప్పనిసరి
సిబ్బంది తీరుపై కలెక్టర్ వెట్రిసెల్వి సీరియస్
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఇటీవల నవజాత శిశువు మృతి చెందిన ఉదంతంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర వైద్య విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్‌తో కలసి ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాధితులు కలెక్టర్ వద్ద బోరున విలపిస్తూ, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్ పోస్ట్ ఆపరేటివ్ వార్డులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు ఆరా తీశారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్ షీట్లు మురికిగా ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు షీట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఓపీ కేంద్రాల వద్ద రోగులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా చూడాలని, హెచ్‌వోడీలు సహా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని, పేదలకు మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు.
విజయవాడ జీజీహెచ్ డాక్టర్‌తో విచారణ
శిశువు మృతి ఘటనపై విజయవాడ జీజీహెచ్ వైద్యులు డాక్టర్ అనిల్‌ను విచారణాధికారిగా నియమించామని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా, వైద్యుల నిర్లక్ష్యం ఉందని తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల, డాక్టర్ శశిధర్, డాక్టర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
శిశువు మృతిపై బంధువులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ వెట్రిసెల్వి ఎంసీహెచ్ విభాగంలో వైద్య సేవలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి
జిల్లాలో మాతా, శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, వైద్యుల నిర్లక్ష్యం తేలితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో వైద్య సేవలు, సీజనల్ వ్యాధుల నివారణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 5 మాతృ మరణాలు, 41 శిశు మరణాలు నమోదయ్యాయని, ప్రతి మరణంపైనా తప్పనిసరిగా డెత్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. వైద్య సేవా లోపాల వల్ల మరణాలు సంభవించినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. అలాగే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శోభ, డీసీహెచ్‌ఎస్ బేబీ కమల, ఐసీడీఎస్ పీడీ శారద, బాలల సంరక్షణాధికారి సీహెచ్ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.


