తణుకు అర్బన్: వైఎస్సార్ సీపీ గ్రీవెన్స్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి బుధవారం తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి హాజరయ్యారు. ఇటీవల ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఒక పోస్టుకు సంబంధించి తణుకుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్‌కు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 7 గంటలకు తణుకు రూరల్ సర్కిల్ కార్యాలయానికి ఆయన హాజరుగాకా రూరల్ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు నాలుగు గంటలకు పైగా విచారణ చేసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి సీఐతో మాట్లాడారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన నారాయణమూర్తితో స్టేషన్‌కు చేరుకున్న తణుకు వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడారు.
భీమవరం: ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాలు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. బలరామ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడం దారుణమన్నారు. పోరాటాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై ఎలాంటి కేసులు పెట్టబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ మాట తప్పి ఇతర కేసుల నెపంతో అక్రమ అరెస్టులకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
చింతలపూడి (జంగారెడ్డిగూడెం): పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థి కునుసోతు బాలసాయి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి వ్యవహారంలో అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాజులకాలనీకి చెందిన బన్ను రావికంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనలతో మనస్తాపానికి గురై ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాన్ని అమ్మమ్మ గ్రామమైన చక్రదేవరపల్లికి తరలించి 25న ఖననం చేశారు. అయితే ఉపాధ్యాయుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పద్మ పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవజోజి, ఎస్సై కుటుంబరావుల సమక్షంలో సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఉపాధ్యాయుల వేధింపుల కోణంతో పాటు అన్ని అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


