మండుతున్న ఎండలు పౌల్ట్రీకి గుబులు పుట్టిస్తున్నాయి. వడదెబ్బతో వేల సంఖ్యల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రోజువారీ గుడ్ల ఉత్పత్తి పదిశాతం మేర తగ్గింది. ఆయా రూపాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి రోజుకు రూ.4.17 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను కలవరపరుస్తున్నాయి.
● షెడ్లలో చల్లదనం కోసం పైకప్పుపై వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేసి కొబ్బరి ఆకులు కప్పాలి. వేడిగాలులు చొరబడకుండా చుట్టూ గోనెసంచులు కట్టి తరచూ వాటిని నీటితో తడుపుతుండాలి. షెడ్లు లోపల ఫ్యాన్లు ఏర్పాటుచేయాలి
● కోళ్లు వడదెబ్బకు గురికాకుండా ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, సప్లిమెంట్స్‌ను వాటర్, ఫీడ్ ద్వారా అందించాలి
● పగటి పూట మేత తగ్గించేసి రాత్రిపూట పెట్టాలి, చల్లటి తాగునీటిని అందించాలి
● విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలి
● చనిపోయిన కోళ్లను లోతుగా గోతులు తీసి పాతిపెట్టాలి
ఎండ తీవ్రతకు చనిపోయిన కోళ్లు
సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు కోటి వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 36 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. వారం రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలతో ముందెన్నడూ లేనివిధంగా కోళ్ల మరణాలు అధికమయ్యాయి. అధికారవర్గాల లెక్కలు ప్రకారం రోజుకు 1.5 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు లక్షన్నర వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకూ నష్టం వాటిల్లుతుండగా కోళ్ల మరణాలు ద్వారా రోజుకు రూ. 3.76 కోట్లు మేర కోళ్ల రైతులు నష్టపోతున్నారు.
ఉత్పత్తిపైనా ప్రభావం
ఎండల తీవ్రత గుడ్ల ఉత్పత్తిపైనా ప్రభావం చూపు తోంది. సాదారణ పరిస్థితుల్లో జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం సుమారు 72 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఎనిమిది లక్షల గుడ్ల డ్రాపింగ్‌తో కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.5.30 పైసలు ఉండగా రోజుకు రూ.42.4 లక్షలు కోల్పోతున్నారు. కోళ్ల మరణాలు, గుడ్ల డ్రాపింగ్ రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు రూ.4.17 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ మేరకు నష్టం జరిగినట్టు అంచనా.
పెరిగిన నిర్వహణ భారం : అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునే జాగ్రత్తలతో ఖర్చు తడిసి మోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక మందులు, షెడ్లలోని వాతావరణాన్ని చల్లబర్చేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం పెరిగిందంటున్నారు. కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్‌సీ, నూకలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ప్రస్తుత ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోళ్ల రైతులు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి : అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశుసంవర్ధకశాఖ జేడీ ఆర్.కోటిలింగరాజు, పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కోళ్ల మరణాల నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వడగాల్పులకు కళ్లు తేలేస్తున్న కోళ్లు
అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన మరణాలు
లక్ష కోళ్ల పౌల్ట్రీలో రోజుకు 1500 వరకు మృత్యువాత
10 శాతం మేర తగ్గిన గుడ్లు ఉత్పత్తి
ఎండల తీవ్రతతో రోజుకు రూ.4.17 కోట్ల నష్టం


