జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపం వద్ద నాగవల్లీ దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,11,511 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్షకు 484 మంది విద్యార్థులకు 55 మంది హాజరయ్యారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 68 మంది విద్యార్థులకు గాను 50 మంది హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ తెలుగు పరీక్షకు 99 మందికి గాను 85 మంది హాజరయ్యారు.
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు నాణ్యతగా ఉన్నాయని తేలింది. బుధవారం ఇదే తరహా పరీక్షలు గ్యాప్–2లో ఈ బృందం నిర్వహించనుంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు మంగళవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 2468 మంది హాజరయ్యారు. ఉదయం 32 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన మ్యాథ్స్ (బీ)/ బయాలజీ,/ జువాలజీ పరీక్షలకు మొత్తం 1452 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 30 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన జువాలజీ/ఎకనామిక్స్–2 పరీక్షలకు మొత్తం 1016 మంది హాజరయ్యారు. వీరిలో 775 మంది జనరల్ విద్యార్థులకు గాను 684 మంది హాజరు కాగా 91 మంది గైర్హాజరయ్యారు. అలాగే 364 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 332 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు.
ఏలూరు టౌన్: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు నగరం, జాతీయ రహదారిపై అర్ధరాత్రి స్వయంగా తనిఖీ చేశారు. ఏలూరు నగరంలోని ప్రధాన కూడళ్ళు, జాతీయ రహదారిలోనూ సిబ్బంది పనితీరును గమనించేందుకు తనిఖీ చేశారు. బ్లూకోల్ట్స్, హైవే పెట్రోలింగ్, నైట్ రౌండ్స్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో కలుస్తూ రికార్డులు పరిశీలించారు. రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది రాత్రివేళల్లో నిరంతరం మూవింగ్‌లో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండకూడదని సిబ్బందికి ఎస్పీ చెప్పారు. నగరంలోని సిబ్బంది బీట్ పుస్తకాలు తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవిలో చోరీలు జరిగే ఆస్కారం ఉందని, కాలనీల్లో తాళాలు వేసిన ఇళ్ళపై నిఘా ఉంచాలని స్పెషల్ క్రైమ్ ప్రివెన్షన్ టీమ్స్‌ను ఆదేశించారు. సరైన కారణాలు లేకుండా యువత రోడ్లపై తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


