నేటి నుంచి నూతన క్యూ కాంప్లెక్స్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నూతన క్యూ కాంప్లెక్స్‌ సేవలు

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ భవనం బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో దర్శన మార్గాలను దేవస్థానం అధికారులు మార్పు చేశారు. ఇకపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు జంట గోపురాల మీదుగా, నూతన అనివెట్టి మండపంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి కొత్త క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలోకి చేరుకోవాలి. ఆ తరువాత దక్షిణ రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశించి, క్యూలైన్ల గుండా స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లాలి. దర్శనానంతరం ఎప్పటిలానే తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్లాలి. ఆ తరువాత పాత అనివెట్టి మండంపం లోంచి షాపింగ్‌ కాంప్లెక్స్‌ మీదుగా పార్కింగ్‌ ప్రదేశాలకు చేరుకోవాలి. అలాగే వీఐపీలు, వీవీఐపీలు తూర్పు రాజగోపురం మీదుగా, అదేవిధంగా గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, రూ. 500 ల (అంతరాలయ) దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు, నిత్య కల్యాణంలో పాల్గొనే వారు ఉత్తర రాజగోపురం మీదుగా, అలాగే అర్చక స్వాములు పడమర రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే క్యూ కాంప్లెక్స్‌లోని ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ డీవీ భాస్కర్‌లు పరిశీలించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఈ కాంప్లెక్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేనున్నారు.

అన్ని సౌకర్యాలతో..

రూ. 12.50 కోట్లతో ఈ నూతన క్యూ కాంప్లెక్స్‌ భవనాన్ని నిర్మించారు. ఇందులో ఉన్న 6 కంపార్ట్‌మెంట్లలో అన్ని సౌకర్యాలను సమకూర్చారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో 250 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా స్టీల్‌ బల్లలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కంపార్ట్‌మెంట్‌లో 5 సీసీ కెమేరాలు, ఒక డిజిటల్‌ స్క్రీన్‌, సెంట్రలైజ్డ్‌ సౌండ్‌ సిస్టమ్‌ను అమర్చారు. ఒక్కో దాంట్లో ప్రత్యేకంగా ఒక హై వాల్యూమ్‌–లో స్పీడ్‌ (హెచ్‌వీఎల్‌ఎస్‌) సీలింగ్‌ ఫ్యాన్‌ను, అలాగే 12 సాధారణ (చిన్న) సీలింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. క్యూ కాంప్లెక్స్‌ పక్కనే మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలోకి వెళ్లేందుకు వీలుగా ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఒక ఎగ్జిట్‌ మర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు మరింత ఉపశమనాన్ని పొందనున్నారు. ఇప్పటి వరకు భక్తులకు సేవలందించిన తాత్కాలిక వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గెడ కర్రలు, టార్పాలిన్‌లతో నిర్మించింది కావడంతో వేసవిలో ఎండ వేడి ఎక్కువగా లోపలికి వస్తోంది. దేవస్థానం అధికారులు జంబో కూలర్ల ద్వారా ఆ వేడి నుంచి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఇక శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ భవనం వాడుకలోకి వస్తోంది కాబట్టి ఇకపై ఆ ఇబ్బందులు తొలగినట్టే.

ఇక ప్రధాన రాజగోపురం మీదుగానే ఆలయ ప్రవేశం

Advertisement
 
Advertisement
Advertisement