కై కలూరులో గళమెత్తిన రొయ్యల రైతులు
కై కలూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఆక్వా రైతులందరికీ జోన్‌లతో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్ రూ.1.50కి అందిస్తానని సీఎం చంద్రబాబు వాగ్ధానం చేసి రెండేళ్లు అవుతోన్నా అమలు చేయడం లేదని రొయ్యల రైతులు మండిపడ్డారు. డెల్టా ఆక్వా ఫార్మర్స్ అసోషియేషన్ పేరుతో ముదినూరి లింగరాజు ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల స్థాయి రొయ్యల రైతుల సమావేశం సీఎన్నార్ గార్డెన్‌లో మంగళవారం జరిగింది. రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జై భారత్, క్షీరారామ ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధి భగవాన్‌రాజు మాట్లాడుతూ రాత్రికి రాత్రి రొయ్యల మేతల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. సోయా, ఫిష్ ఆయిల్ వంటి మేతల ముడిసరుకులు ధరలు తగ్గినప్పుడు కంపెనీలు రేట్లు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. కోనసీమ ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు సీహెచ్.నాగభూషణరావు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన అప్సడా యాక్టులో రైతులకు అవసరమైన ఎన్నో చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. భీమవరం ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు తులశి రాంబాబు మాట్లాడుతూ రైతుల నష్టాల కారణమవుతున్న సిండికేట్లపై పార్టీలకతీతంగా అందరూ కలసి పోరాటం చేయాలన్నారు. మరో సంఘ నాయకుడు సుబ్బరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ప్రాథన్యత ఇవ్వాలన్నారు. యువ రొయ్యల రైతు యువరాజు మాట్లాడుతూ హేచరీలలో రొయ్య సీడ్ వల్ల నష్టపోతే రైతులు సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్టు చేస్తే మరొకరు నష్టపోరన్నారు. కార్యక్రమంలో కై కలూరు ఏఎంసీ చైర్మన్ పెన్మత్స త్రినాథరాజు, ప్రకాశం జిల్లా ఆక్వా సంఘ నాయకుడు కుమార్, ఆక్వా రైతులు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, సయ్యపురాజు గుర్రాజు, గాదిరాజు కిట్టు, బొడ్డు నోబుల్, నర్సిపల్లి రవి, బీకేఎం.నానీ, బలే ఏసురాజు, జంపన రామలింగరాజు, భాస్కరరాజు, బూరుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


