భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో జరిగిన రొయ్యల ఎగుమతిదారులు, ఆక్వా సంఘ నాయకులు, రైతుల సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రొయ్యల ధరల పెరుగుదల లేదా స్థిరత్వంపై ఎక్స్‌పోర్టర్ల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది. ఈ సమావేశానికి కొందరు ఎక్స్‌పోర్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఎగుమతిదారుల నాయకుడు తోట జగధీష్ మాట్లాడుతూ.. ఈక్వెడార్, చైనా దేశాలలో రొయ్యల ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్లే మన రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, ధరలు తగ్గుతున్నాయని వెల్లడించారు. కోవిడ్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, దీనికి తోడు ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబర్ సమస్య కూడా ఉందని పేర్కొంటూ, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు, సుబ్బరాజులు మాట్లాడుతూ.. కేవలం పది రోజుల వ్యవధిలోనే టన్నుకు రూ.50 వేల వరకు రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు కనీసం 10 నుంచి 15 రోజుల పాటైనా స్థిరంగా ఉండేలా చూడాలని కోరారు. ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్స్‌పోర్టర్లు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి కొన్ని సూచనలు చేశారు. ఎక్స్‌పోర్టర్లు, ఆక్వా రైతులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీడ్ (మేత) ధరల విషయంలో రైతులకు ఉపశమనం కలిగించామని, లేబర్ సమస్యను కూడా వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎగుమతిదారులు ధరలను మార్చే ముందు రైతులతో చర్చించాలని, నిర్ణయించిన రేట్లు కనీసం 15 రోజుల వరకు స్థిరంగా ఉండేలా చూడాలని, అప్సడా రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్టుబడి వ్యయం పెరిగి, రొయ్యల ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో అప్సడా డైరెక్టర్ వి.సత్యనారాయణరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి డి.శ్రీనివాస్, ఎంపెడా డీడీ ఆనంద్, ఆక్వా రైతులు, హ్యాచరీ యజమానులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.


