ఏలూరు (టూటౌన్): జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన తండాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, రవాణా, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపనకు అవగాహన కల్పించి, సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు జారీ చేయాలన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్ సమీక్ష ఈ విషయం వెల్లడించారు.


