కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి అడవుల నుంచి ఆదివాసీలను తరలిస్తే తిరుగుబాటే వడదెబ్బకు ఐదుగురి బలి

నూజివీడు: కారు ఢీకొని ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి చెందిన ఘటన పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ యండ్రపాటి రవికుమార్‌ (37) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పుల్లల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకొని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో గల ఫ్యాక్టరీ వద్ద పుల్లలను దించి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నూజివీడు బైపాస్‌ రోడ్డులో గల బృందావన్‌ గార్డెన్‌ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి కారు ట్రాక్టర్‌ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. రవికుమార్‌కు భార్య వీర ధర్మవతి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ పీ సత్య శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పోలవరం రూరల్‌: నేషనల్‌ పార్క్‌, టైగర్‌ జోన్ల పేరుతో ఆదివాసులను అడవుల నుంచి తరలిస్తే తిరుగుబాటు తప్పదని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్‌ అన్నారు. గడ్డపల్లిలో మంగళవారం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్‌ పార్క్‌ పేరుతో టైగర్‌ జోన్ల అభివృద్ధి పేరుతో గడ్డపల్లి పంచాయతీ గ్రామాలైన దారువాడ, చిలకలూరు, తంగేడుగొండ, గిన్నెపెల్లి, చీమలూరు, గడ్డపల్లి గ్రామాలను అడవి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ఆదివాసులు, అడవి జంతువులు కలిసి మెలిసి జీవిస్తున్న ప్రకృతి సహజ సిద్ధ జీవన సౌందర్యం అడవిని ప్రభుత్వం ధ్వంసం చేయడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కారం రాఘవ, సరియం రామ్మోహన్‌, పీవైఎల్‌ జిల్లా కన్వీనర్‌ గురుగుంట్ల ప్రసాద్‌, అరుణోదయ రాష్ట్ర కమిటీ నాయకుడు నడపల ముక్క రెడ్డి, ముంజలూరు సర్పంచ్‌ కెచ్చల ముక్కారెడ్డి, గడ్డపల్లి వైస్‌ ప్రెసిడెంట్‌ ముసలారెడ్డి, పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌: జిల్లాలో వడగాలులు తట్టుకోలేక ఐదుగురు మృతి చెందారు. పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్తా వీధికి చెందిన పెదమల్లు అనసూయ (85) మంగళవారం వడదెబ్బ తగిలి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందింది.

నిద్రలోనే మరణం

ఆగిరిపల్లి: మండలంలోని అనంతసాగరంనకు చెందిన ఈసం వెంకటేశ్వరరావు (70) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరరావు తన గేదెలను మేపడానికి పొలంలోకి తోలుకొని వెళ్లాడు. ఎండవేడికి వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందజేశారు. మంగళవారం ఉదయం వెంకటేశ్వరరావు నిద్రలోనే మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉపాధి హామీ పనికి వెళ్లి..

కుక్కునూరు: వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కమ్మరిగూడెం గ్రామానికి చెందిన మిడియం ఎర్రయ్య (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

చింతలపూడిలో...

చింతలపూడి: స్థానిక వైఎస్సార్‌ కాలనీకి చెందిన తోట సీతామహాలక్ష్మి (37) సోమవారం వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

కొత్తగూడెంలో...

దెందులూరు: కొత్తగూడెంలో ఉపాధి కూలీ లంకపల్లి ఏలియా (55) మంగళవారం వడదెబ్బకు మృతి చెందాడు. ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఏలియా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే దెందులూరు ప్రభుత్వాసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement