కుక్కునూరు: వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్‌పై మంగళవారం కేసు నమోదైంది. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బ్లాక్ మెయిల్ చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.
నూజివీడు: పల్లెర్లమూడికి చెందిన వైద్యురాలు ఉప్పలపాటి స్రవంతి న్యూరాలజీ విభాగంలో దేశవ్యాప్తంగా టాపర్‌గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు ఈ గౌరవం లభించింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈనెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు స్రవంతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం స్రవంతి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు


