జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాల వద్ద సోమవారం రైతులు ధర్నాకు దిగారు. వేలం కేంద్రాల పరిశీలనకు అనుమతి లేదని వేలం అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం కేంద్రం ఆవరణలో ధర్నా చేపట్టి వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లేదని సాకు చూపి వర్జీనియా పొగాకు రైతులను నిలువునా దోచేస్తున్నారని విమర్శించారు. పొగాకు రైతులు నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కిలో వర్జీనియా పొగాకు సరాసరి ధర రూ.380 కల్పించాలని డిమాండ్ చేశారు. వేలం కేంద్రాల పరిశీలనకు అను మతి లేదనడం తగదన్నారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శమని విమర్శించారు. తమను కంపెనీల ప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. వచ్చేనెల 1న గుంటూరు పొగాకు బోర్డు కా ర్యాలయం వద్ద రైతుల రాయబారం కార్యక్రమం చేపట్టారని, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
పొగాకు రైతులను ఆదుకోవాలి
రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, పొగాకు రైతుల సంఘం నాయకులు బిక్కిన వీరసత్యం, ఎల్.సత్యనారాయణ, బండారు నాగరాజు, గూడవల్లి రామకృష్ణ, ఘంటసాల ప్రభాకరరావు త దితరులు మాట్లాడుతూ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కనీస ధరలు రాక పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పొగాకు పండించినా గిట్టుబాటు ధర లేదన్నారు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా


