25 శాతం ఉచిత సీట్లు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

25 శాతం ఉచిత సీట్లు అమలు చేయాలి

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

25 శాతం ఉచిత సీట్లు అమలు చేయాలి 29న జాబ్‌ డ్రైవ్‌

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తప్పనిసరిగా 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కో–కన్వీనర్‌ నెరుసు నాగమణి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ (ఆర్టీఈ) చట్టాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం సీట్లు పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఆ సీట్ల వివరాలు, ఫీజుల వివరాలను పాఠశాలల ముందు బహిరంగంగా ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగమణి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు సరైన జీతాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా యూత్‌ కన్వీనర్‌ వీర్ల పాపారావు, కై కలూరు నియోజకవర్గం కన్వీనర్‌ తోకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు (టూటౌన్‌): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు కంపెనీలు జాబ్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నాయని జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్‌ కెరీర్‌ సర్వీసులో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ డ్రైవ్‌లో క్లౌడ్‌మెలో, సేఫ్‌మాక్‌ సొసైటీ, ఎస్‌బీఐ లైఫ్‌ బీమా కంపెనీలు ఉంటాయన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు పాల్గొనవచ్చన్నారు. నెలకు రూ.13 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందని, మరిన్ని వివరాల కోసం 8886882032, 7416118388 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement