రోడ్డుపైనే బాణసంచా కాల్పులు.. నిలిచిన ట్రాఫిక్
ఎండ తీవ్రతతో ప్రజలు, ప్రయాణికుల అవస్థలు
ప్రమాణస్వీకారం సందర్బంగా రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్
భీమవరంలో ఎండ తీవ్రతతో జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిన రోడ్డు
భీమవరం: కూటమి నాయకులు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన హంగామా, రోహిణీ కార్తె ప్రవేశంతో భానుడి భగభగలతో జనం ఠారెత్తారు. మరొక వైపు విద్యుత్ కోతలతో ప్రయాణికులు, ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటలకే రోడ్లపై తిరగడానికి ప్రజలు భయపడ్డారు. ఇలాంటి తరుణంలో అత్యవసర పనులను ముగించుకుని ఇంటికి చేరదామనుకున్న పాదచారులు, వాహనదారులకు భీమవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చుక్కలు కనిపించాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి యనమదుర్రు కాలువపై ఉన్న కాలిబాట వంతెనకు దగ్గరలో ఉండటంతో ఆ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.
నిత్యం వేలాది మోటారుసైకిళ్లు, పెద్ద సంఖ్యలో కాలినడకన వెళ్లే ప్రజలు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రమాణస్వీకారం సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా రోడ్డుపైనే కాల్చడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీనికి తోడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకుల వాహనాలతో ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
మండుటెండలో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ఆసుపత్రికి వచ్చే రోగుల అవస్థలు వర్ణనాతీతం. రోడ్డుపైనే బాణసంచా కాల్చడంతో వాహనాలు వెళ్లే దారిలేక ఎండలోనే నిలబడక తప్పలేదు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ విజయోత్సవాలు, వివిధ సభలను ప్రధాన రోడ్డుపైనే నిర్వహించడంతో ప్రయాణికులు తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు అప్రకటిత విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు విలవిలలాడారు. బయట గాలి లేక, ఇళ్లలో ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


