ద్వారకాతిరుమల: రోజురోజుకి పెరుగుతున్న భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. మానవులైతే ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి వాటి ద్వారా ఎండ వేడిమి నుంచి ఉపసమనాన్ని పొందుతున్నారు. మరి జంతువుల పరిస్థితి ఏంటి? ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన దేవస్థానం గోసంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్‌లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ.2 లక్షలకు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్లు కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానం చేస్తూ సేదతీరుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. చల్లని షెల్టర్‌లో కజానా బాతులకు మంచినీరు, మేతను అందిస్తున్నారు. కుందేళ్ల పార్కులో వాటి కింద పచ్చగడ్డి వేసి, అక్కడే మేత, మంచి నీటిని ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలో మూగజీవాలపై ఆలయ అధికారులు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను పలువురు భక్తులు ప్రశంసిస్తున్నారు.
జల్లు స్నానం చేస్తున్న అశ్వం, ఆవులు
జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు


