పెట్రోలు బంకు వద్ద మంటలు | - | Sakshi
Sakshi News home page

పెట్రోలు బంకు వద్ద మంటలు

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

పెట్రోలు బంకు వద్ద మంటలు కానిస్టేబుల్‌ వేధింపులపై ఫిర్యాదు

తణుకు అర్బన్‌ : తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం రోడ్డులో పెట్రోలు బంకు ప్రాంతంలో వ్యాపించిన మంటలు ఆందోళన రేకెత్తించాయి. కన్యకా ఫిల్లింగ్‌ సెంటర్‌ సరిహద్దులోని పొలంలో ఏపుగా ఎదిగిన పచ్చగడ్డి ఎండకు ఎండిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలకు అతి సమీపంలోనే బంకులోని పెట్రోలు పంపు ఉండడంతో బంకు సిబ్బందితో పాటు ప్రయాణికులు కొంతసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ మండలానికి చెందిన ఒక వివాహిత ఆరోపణలు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితకు 2023లో కుక్కునూరు స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఈబీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. సారా అమ్మేవారి సమాచారం అందించాలంటూ తనను ఇన్‌ఫార్మర్‌గా ఉపయోగించుకుని, ఆ క్రమంలో తనకు దగ్గరయ్యాడని ఆమె తెలిపింది. ఈ వ్యవహారం తన భర్తకు తెలియడంతో అప్పటి నుంచి ఆ కానిస్టేబుల్‌తో మాట్లాడటం మానేశానని వివరించింది. ప్రస్తుతం కుక్కునూరు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సదరు కానిస్టేబుల్‌, తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. చెప్పినట్టు వినకపోతే గతంలో తీసిన వీడియోలు, రికార్డింగ్‌లు బయటపెడతానని, ఆర్థికంగా దెబ్బతీస్తానని, అట్రాసిటీ కేసు పెడతానని, తన భర్తను, పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె వాపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement