నామినేషన్ ద్వారా పనులు
కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి
ఏలూరు (టూటౌన్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ ప్రైవేట్ లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనకు నామినేషన్ విధానంలో పనులు చేయించేసి సొమ్ము చేసేసుకున్నారు. లేఅవుట్ నిబంధనలు, నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.1.73 కోట్లతో స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్‌ఎంఆర్ నగర్ లేఅవుట్‌లో రోడ్లు, డ్రెయిన్లు, పైప్‌లైన్ పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ గ్రాంట్లు, పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములతో ఎవరి మెప్పు కోసం నగరపాలక సంస్థ అధికారులు ఈ లేఅవుట్‌లో వెచ్చించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లేఅవుట్ నిబంధనలు ఇలా..
లేఅవుట్ నిబంధనలను అనుసరించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన సమయంలో రోడ్లు, డ్రెయిన్లు, వీధి లైట్లు, వాటర్ సప్లయ్, పైప్‌లైన్లు, ప్లాంటేషన్ పనులు లేఅవుట్ యజమానులు చేయించాలి. వీటి కోసం లేఅవుట్‌లో 30 శాతం స్థలాన్ని కేటాయించాలి. అలాగే పార్కులు, ప్లే గ్రౌండ్ కోసం మరో 10 శాతం స్థలం కేటాయించాలి. ముఖ్యంగా మౌలిక వసతులకు అయ్యే ఖర్చును యజమానులే భరించాల్సి ఉంటుంది. ఇలా అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఆ లేఅవుట్‌ను స్థానిక సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పార్కులు, ప్లేగ్రౌండ్ కోసం ఉంచిన స్థలాన్ని గిఫ్ట్ డీడ్ కింద స్థానిక సంస్థకు లేఅవుట్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సదరు లేఅవుట్‌ను స్థానిక సంస్థ అధికారులు పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి. అనంతరం ఆ లేఅవుట్‌లో నిర్వహణ పనులు మాత్రమే స్థానిక సంస్థలు చేపట్టాల్సి ఉంది.
నిర్వహణ పనులు మాత్రమే చేయాల్సిన చోట వసతులు
ఏలూరు మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్‌ఎంఆర్ నగర్‌ను నగరపాలక సంస్థకు గతంలో అప్పగించారు. అక్కడ నిర్వహణ ప నులను మాత్రమే చే యాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.35 కోట్ల నిధులతో రోడ్లు, డ్రెయిన్లు వేయించారు. అలాగే అత్యవసరం కాని పనులను నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.29.35 లక్షలతో ఆరు పైపులైన్, రూ.8.49 లక్షలతో ఆర్‌సీసీ కల్వర్టు, అప్రోచ్ పనులకు కమిషనర్ అనుమతించగా ఆ యా పనులు చేసేశారు. నామినేషన్ పద్ధతిని చేసిన ఆరు పైప్‌లైన్ పనులు మూడు పనులుగా మాత్ర మే చేయాలి. కానీ రూ.5 లక్షలు దాటకూడదనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ అధికారులు ఆ మూడు పను లను ఆరు ముక్కలుగా చేసి అక్రమాలకు తెరతీశా రు. నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు.
క్రాస్ రోడ్డు నం.3లో 110 మి.మీ హెచ్‌డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.87 లక్షలు
క్రాస్‌రోడ్లలో 110 మి.మీ హెచ్‌డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.89 లక్షలు
160 మిమీ హెచ్‌డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు
దక్షిణ వైపు క్రాస్ రోడ్డులో 160 మి.మీ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు
మెయిన్ లైన్ హెచ్‌డీపీఈ పంపిణీ పైప్‌లైన్ రెక్టిఫికేషన్‌కు రూ.4.85 లక్షలు
క్రాస్ రోడ్లలో హెచ్‌డీపీఈ పంపిణీ పైప్‌లైన్ రెక్టిఫికేషన్‌కు రూ.4.90 లక్షలు
ఆర్‌సీసీ కల్వర్ట్ నిమిత్తం రూ.4.99 లక్షలు
సీసీ అప్రోచ్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు
మొత్తంగా నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు
సీసీ డ్రెయిన్‌కు రూ.10.22 లక్షలు
సీసీ డ్రెయిన్‌కు రూ.10.85 లక్షలు
సీసీ రోడ్డుకు రూ.23.92 లక్షలు
సీసీ రోడ్డుకు రూ.27 లక్షలు
సీసీ డ్రెయిన్‌కు రూ.10.37 లక్షలు
సీసీ రోడ్డుకు రూ.52.63 లక్షలు
మొత్తంగా ఆర్థిక సంఘ నిధులు రూ.134.99 లక్షలు
ప్రజాధనాన్ని ప్రైవేట్ లేఅవుట్‌లో ఖర్చుపెట్టారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ అధికారులు, కమిషనర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలకు అప్పగించిన ప్రైవేట్ లేఅవుట్‌లను కేవలం నిర్వహణ మాత్రమే చేయాల్సి ఉండగా ఎస్‌ఎంఆర్ నగర్‌లో ఏకంగా పనులు చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారు. ఈ అక్రమాలపై లోకాయుక్తను ఆశ్రయించడంతో పాటు కలెక్టర్, విజిలెన్స్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తా.
–కేవీ సాయిప్రసాద్, మున్సిపల్ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఏలూరు
ప్రైవేట్ లేఅవుట్‌లో నామినేషన్ పనులు
రూ.1.73 కోట్ల కార్పొరేషన్ నిధులతో మౌలిక వసతులు
15వ ఆర్థిక సంఘం నిధులూ వినియోగం
నగరపాలక సంస్థ అధికారుల లీలలు


