కనసానపల్లిలోని రావిచెరువులో మట్టి తవ్వకాలు
ఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమార్కులు కంకరను తవ్వి తరలించేస్తున్నారు. అయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వారం రోజులుగా మెట్ట ప్రాంతంలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో అఽధికార పక్ష నాయకులే తవ్వకాలు చేస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ చింతల వాసు ఆదివారం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఉంగుటూరులోని ఎర్రచెర్వు, నల్ల చెర్వు, ఎల్లమిల్లి, ఎర్రమళ్ల, గొల్లపాడు, బాదంపూడి, గొల్లగూడెం, గోపాలపురం, గోకవరం తదితర గ్రామాల్లో కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలతో చెరువుల్లో 20 అడుగులకు పైగా భారీ గోతులు పడ్డాయి. దీంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అధికారపక్ష నేతలే అక్రమ తవ్వకాలకు పాల్పడుతుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు.


