● పండుగలు, ఇంటి శుభకార్యాల్లో లయబద్ధంగా నృత్యాలు
● వినసొంపుగా సరిగమలు ఎరుగని రాగాలు
బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరికి బయట ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే ప్రపంచం. ప్రకృతి అందించిన సంగీతం వీరి సొంతం. సరిగమలు ఎరుగని రాగాలతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ పండుగలు, శుభకార్యాల్లో సందడి చేస్తారు.
నేటి ఆధునిక ప్రపంచంలో సంగీతం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. డాన్సుల్లో అనేక రకాలు పుట్టు కొస్తున్నాయి. ‘రామ.. రామ.. రామ.. ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలా. రామ..రామ..రామ.. ఉయ్యాలో...రాగమెత్తరాదే ఉయ్యాలా....’ అంటూ బతుకమ్మ పాటలు పాడడం రాదు. ‘అదిగో అల్లదిగో శ్రీ హరి వాసమూ పదివేల శేషుల పడగల మయమూ’ అంటూ అన్నమయ్య కీర్తనలు పాడరు. బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్, కూచిపూడి, భరత నాట్యం తెలియదు. వీరికి తెలిసింది చుట్టూ కొండకోనలు, వాగు వంకలతో అలలారే గిరి పల్లెల్లో ప్రకృతి నేర్పిన సంగీతం, నాట్యంతోనే తమదైన శైలిలో ఆట, పాటలతో జీవితాన్ని ఆనందంగా గడపుతుంటారు. కూ... అంటూ కూసే కోయిలమ్మల పాట, గలగలపారే సెలయేటిని మరిపించే కమ్మదనం గిరిపుత్రుల ఆట, పాటలు సొంతం. గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రెరెలయ్య ..రెరెల....రెరెలా....రేలా....’అంటూ పాడుకుంటే కొండరెడ్లు ‘జొన్నకూడు...జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చపండుగ, మామిడి పండుగ, చింత పండుగ, భూదేవి పండుగలలో పాడుకుంటారు. అలాగే పెళ్ళిళ్ల సమయంలో కొండరెడ్డు ‘కళ్ళేడమ్మ.. కళ్ళేడమ్మ.. గోగులపిల్లకు.. కెచ్చెల పెల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు.
వాయిద్య పరికరాలు సొంతంగా తయారీ
కొండరెడ్డి గిరిజనులు వారు వాయించే వాయిద్య పరికరాలు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్టులతో డప్పుల నమోనాలను తయారు చేసి వాటిని మేక చర్మాలతో అందంగా తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు.
వేసవిలోనే డోలుకొయ్యిల
వాయిద్యాల మోత
గిరిజన పల్లెలు వేసవి కాలంలో డోలు కొయ్యిల వాయిద్యాలతో మోగిపోతుంటాయి. ఇటు శుభ కార్యాలతో పాటు గిరిజనులు తరతరాలుగా జరుపుకునే బాట పండుగ, మామిడికాయ పండగ వన దేవతలు పండుగలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో డోలుకొయ్యిల వాయిద్యాలు, రేల పాటలు, సాంప్రదాయ నృత్యాలు గ్రామాల్లో సంచరించే వారికి కనువిందు చేస్తాయి.


