అయ్యో.. రొయ్య | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. రొయ్య

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

పది రోజుల వ్యవధిలో ధరల వ్యత్యాసం

క్రితం

సిండికేటుగా దోచేస్తున్నారు

రైతుల పోరుబాట

సాక్షి, భీమవరం : రొయ్య ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల వ్యవధిలో కౌంట్‌ను బట్టి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పడిపోవడంతో ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సిండికేటు దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో నిరసన తెలిపేందుకు ఆక్వారైతు సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్‌ వరకు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్‌ వరకు చైనా, యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పది రోజుల క్రితం 100 కౌంట్‌ కిలో రూ.265 ఉండగా ప్రస్తుతం రూ.230కి పడిపోయింది. నేరుగా కంపెనీలకు కాకుండా మధ్యలో దళారులకు విక్రయించుకునే వారికి రూ.220లోపే ఉంటుంది. అన్ని కౌంట్ల రొయ్యల ధరలు ఆదే మాదిరి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిపోయాయి. ప్రతికూల వాతావరణం, నాణ్యతలేని సీడు, ఫీడుతో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోకి రొయ్యలు అధికంగా వస్తుండటంతో ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి భారీ మొత్తంలో కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఆన్‌సీజన్లో ఎగుమతులు చేసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంటారని చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధరలను తగ్గించేస్తున్నారని, ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కౌంట్‌ 10 రోజుల ప్రస్తుతం

100 రూ.265 రూ.230

90 రూ.275 రూ.240

80 రూ.295 రూ.260

70 రూ.305 రూ.270

60 రూ.315 రూ.280

50 రూ.335 రూ.305

40 రూ.365 రూ.335

30 రూ.475 రూ.435

రైతులకు సిండికాటు

రొయ్య ధరలు భారీగా పతనం

పది రోజుల వ్యవధిలో కౌంట్‌కు రూ.30 నుంచి రూ.40 వరకు వ్యత్యాసం

ఎకరానికి రూ.లక్ష వరకు నష్టపోతున్న రైతులు

ఇప్పటికే మేత ధరలు పెంచుతామంటున్న ఫీడ్‌ కంపెనీలు

పోరుబాట పట్టిన ఆక్వా రైతులు

నేడు పాలకొల్లులో భారీ నిరసన

ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. మార్కెట్‌లోకి రొయ్యలు ఎక్కువగా వచ్చే సమయం చూసి ముందుగానే ధరలు తగ్గించేస్తున్నారు. సిండికేటు దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం పాలకొల్లులో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉదయం 9 గంటలకు పూలపల్లి వై జంక్షన్‌ వద్ద జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరుతున్నాం.

– గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, జైభారత్‌ క్షీరారామా ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు, పాలకొల్లు

మేత ధరల పిడుగు

మేత ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ఫీడ్‌ కంపెనీలు ప్రకటించిన విషయం విదితమే. ఈ ధరలు అమల్లోకి వస్తే టన్ను మేత ధర అధనంగా రూ.10 వేల వరకు పెరగనుంది. ఎకరానికి రెండు నుంచి రెండున్నర టన్నుల మేత వినియోగిస్తుండగా రూ.20 వేల నుంచి 25 వేల భారం పడుతుంది. మేత ధరల పెంపును నిరసిస్తూ వీరవాసరం, పాలకొల్లులో రైతులు ఆందోళనలు చేసి ఫీడ్‌ బస్తాలను తగలపెట్టారు. వైఎస్సార్‌ సీపీ రైతులకు మద్దతుగా నిలిచింది. ధరలు పెంచితే రైతులకు అండగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి మేత ధరల పెంపును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా ధరలు పెరగడం ఖాయమన్న ఆందోళనలో రైతులు ఉన్నారు.

సీడు, ఫీడు ధరలు, చెరువుల లీజు తదితర ఖర్చులతో వంద కౌంట్‌ కేజీ రొయ్యల ఉత్పత్తికి రూ. 250 వరకు వ్యయమవుతుందని రైతులు అంటున్నారు. ధరలు తగ్గించేసి రూ.230కు కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ప్రాసెసింగ్‌, ఫీడ్‌ ప్లాంట్లు, ఎగుమతిదారులు ఆక్వా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. రొయ్యల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో భారీ ఎత్తున నిరసన తెలపనున్నట్టు జైభారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం గురువారం ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement