ఇళ్ల గణనను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల గణనను పూర్తి చేయాలి

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

ఇళ్ల గణనను పూర్తి చేయాలి అథ్లెటిక్స్‌ పోటీలు వాయిదా ప్రాజెక్టులు పూర్తిచేయాలి వబదెబ్బకు మహిళ మృతి ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బోదెలో పడి దివ్యాంగుడి మృతి

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురం పంచాయతీ మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణనను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్లగణనను సచివాలయ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వేడి గాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అవసరమైన మేర చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 22న నిడమర్రు మండల పరిషత్‌ కార్యాలయంలో నిడమర్రు గ్రామానికి సంబంధించి ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనల కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

ఏలూరు రూరల్‌ : ఈ నెల 21న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టాల్సిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు వాయిదా వేశామని డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్లు ఇబ్బందులు పడకుండా పోటీలు వాయిదా వేశామని వివరించారు. త్వరలో జిల్లా అథ్లెటిక్స్‌ కోచ్‌ జి.కృష్ణకుమారి, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్‌తో చర్చించి తదుపరి పోటీల నిర్వహణ తేదీ వెల్లడిస్తామన్నారు.

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): నిధులు కేటాయించకుండా వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలలోని ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు.

ఆగిరిపల్లి: మండలంలోని చొప్పరమెట్లకు చెందిన పోలగాని నాగేశ్వరమ్మ (55) వడదెబ్బ తగిలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నాగేశ్వరమ్మ ఎప్పటిలాగానే సగ్గూరు చెరువు వద్ద గేదెలు మేపడానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుం సభ్యులు వెతకగా చెరువు సమీపంలో పొలాల వద్ద ఆమె విగతజీవిగా పడి ఉంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఆమె వడదెబ్బ తగిలి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరమ్మకు ఇరువురు కుమారులు ఉన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 32 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 1614 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 31 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 893 మంది హాజరయ్యారు.

ముదినేపల్లి(కై కలూరు): సదరం ధ్రువపత్రానికి ఏలూరు వెళ్లిన గురజా గ్రామానికి చెందిన దేవరకొండ పోతురాజు(30) గురజ గవర్నమెంటు కాలేజీ వెనుక బోదెలో శవమై గురువారం కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోతురాజు ఈ నెల 18న ఏలూరు ప్రభుత్వాసుపత్రికి సదరం ధ్రువపత్రం కోసం వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అన్నయ్య చిన్న వెంకటేశ్వరరావు 19న ముదినేపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యల్లో భాగంగా అతడు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. సోదరుడి ఫిర్యాదుపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement