ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్‌వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడిచిన 15 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,06,21,794 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 281 గ్రాముల బంగారం, 2.887 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ.31 వేలు లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు.


