అరుదైన జాతి
చంపడం నేరం
కై కలూరు: ప్రకృతి రమణీయతకు, పక్షుల అందాలకు చిరునామాగా నిలుస్తున్న కొల్లేరు ప్రాంతంలో అరుదైన కొండ చిలువల మరణమృదంగం మోగుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ వీటి భారీకాయాన్ని చూసి భయపడి జనం చంపేస్తున్నారు. కై కలూరు నియోజకవర్గం కలిదిండి లాల్వ డ్రెయిన్ సమీప చెరువుపై సోమవారం 10 అడుగుల భారీ కొండ చిలువ కనిపించడంతో పొలుగు, పారతో దాని తల పగులగొట్టి ప్రాణం తీశారు. ఇటువంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి 9 మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.90లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. ఈ ప్రాంతానికి సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండ చిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పాదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్ట వేశాయి. కొల్లేరు చిత్తడి నేలలు కొండ చిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండ చిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి.
భయపడి ఊపిరి తీసేస్తున్నారు..
సరీసృపాలలో అరుదైన కొండచిలువలను వాటి భారీ ఆకారాలను చూసి దాడి చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కలిదిండి, కై కలూరు మండలం ఆటపాక, వరహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. ఇవి మాంసాహారులు. నీటిలో సైతం వేగంగా ఈదగలవు. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ఒంటరిగా కనిపిస్తున్న సమయంలో వీటిని హతమారుస్తున్నారు.
అంతరిస్తున్న అరుదైన జాతి
ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండ చిలువల శాసీ్త్రయ నామం పైథాన్ మోలురూస్. గోధుమరంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఏడాది వయసు నుంచి జత కడుతుంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏటా 20 నుంచి 30 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా.
పుట్టిన బిడ్డలను తల్లే తినేస్తోంది
సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జతకట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పాడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఇవి ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఎక్కువగా ఉంది.
ఇండియన్ రాక్ పైథాన్‌గా పిలిచే కొండచిలువలు అరుదైనవి. వీటిని ప్రభుత్వాలు షెడ్యూ ల్–1 కేటగిరిలో చేర్చింది. ఎలుకలు, కోళ్లు, పందికొక్కులను తింటాయి. ఇవి అంతరించిపోతున్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి విషపూరితం కావు. ఇవి కనిపిస్తే చంపకుండా ఫారెస్టు అధికారులకు చెప్పండి . – కంటమహింతి మూర్తి,
తూర్పు కనుముల వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడు, విశాఖపట్టణం
కొండ చిలువలు అరుదైన జాతి. వీటిని చంపడం నేరం. మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ జాతిని షెడ్యూల్–1లో చేర్చారు. కొల్లేరు ప్రాంతాల్లో కనిపిస్తే అటవీశాఖ అధికారులకు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తే టొరిటోరియల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతాం.
– కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, కై కలూరు
ప్రజల చేతుల్లో కొండ చిలువలు హతం
మూడు దశాబ్దాలుగా కొల్లేరు చిత్తడి నేలల్లో నివాసాలు
చేపల, రొయ్యల చెరువు గట్లుపై సంచారం
అంతరిస్తున్న జాతిగా గుర్తించిన ఐయూసీఎన్
ఆందోళన వ్యక్తం చేస్తున్న అటవీశాఖ


