ఉంగుటూరు: చేబ్రోలులోని లక్ష్మీ సమన్విత ధర్మాకోల్ పరిశ్రమలోని గోదాములో మంగళవారం తెల్లారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గోదాములో ఉన్న ధర్మాకోల్ పెట్టెలు దగ్ధమయ్యాయి. లక్షలాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో మంటలను అదుపుచేసే పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో ముడి సరుకు నిల్వ ఉంచిన గోదాములోకి మంటలు వ్యాపించకుండా సిబ్బంది కట్టడి చేశారు. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
పాలకోడేరు: విస్సాకోడేరులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ ఎం సుధాకర్‌రావు తెలిపారు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంచెం వెంకట గణేష్, బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన మరో ఇద్దరు బడేటి దుర్గా మహేష్ అలియాస్ బాబి, దేవరకొండ భోగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగో నిందితుడు ఆకుల చిన్న పరారీలో ఉన్నాడని, అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను విద్యార్థులు జూన్ 30వ తేదీలోగా ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి వెరిఫికేషన్ చేయించుకుని రసీదు పొందాలన్నారు. వివరాలకు 08816 297093, 96664 07468 నంబర్లలో సంప్రదించాలన్నారు.
కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన మోటపర్తి వెంకట శివ నాగ గణపతిరాజు (63) మంగళవారం ఉదయం తన మోటార్‌సైకిల్‌పై అశ్వారావుపేట బయలుదేరాడు. కొయ్యలగూడెం గ్రామ శివారు సామిల్లు దాటిన తరువాత మోటార్‌సైకిల్ అదుపు తప్పి రోడ్డుమార్జిన్‌పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మోటపర్తి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెనుగొండ: మోటార్‌సైకిల్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పెనుగొండ ఏఎస్సై అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం మండలం అంకంపాలెంకు చెందిన పేరూరి వెంకట రమణ (53) మధుమేహ సమస్యలు, హైపర్ టెన్సన్‌తో బాధపడుతోంది. మంగళవారం ఉదయం కుమారుడు సతీష్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై తణుకు వైపు వెళ్తుండగా దొంగరావిపాలెం వద్ద అకస్మాత్తుగా స్పృహ తప్పి రోడ్డపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకట రమణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మహిళపై దాడి
భీమవరం: బ్యాంక్‌లో తీసుకున్న లోన్ తిరిగి చెల్లించడంలో ఆలస్యమైందనే కారణంతో తన మరిధి కొట్టాడంటూ భీమవరం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఉయ్యూరు విజయదుర్గ పిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై రామారావు మంగళవారం తెలిపారు. పట్టణంలోని బలుసుమూడి బీసీ కాలనీకి చెందిన విజయదుర్గ తన మరిధి సత్యనారాయణ, తోటి కోడలు పేరున బ్యాంక్‌లో రుణం తీసుకుంది. అయితే ఇప్పటికే కొంతమొత్తం బ్యాంక్‌కు చెల్లించగా మిగిలిన సొమ్ము ఎందుకు చెల్లించలేదంటూ కొట్టి గాయపర్చాడని పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.


