మిస్టరీగా బాలింత మృతి కేసు | - | Sakshi
Sakshi News home page

మిస్టరీగా బాలింత మృతి కేసు

May 20 2026 2:16 AM | Updated on May 20 2026 2:16 AM

మూడురోజులుగా మృతదేహం మార్చురీలోనే..

పత్తాలేని వైద్యారోగ్య శాఖ

శిశువు భీమవరం శిశు గృహకు

తణుకు అర్బన్‌: తణుకులో సంచలనం రేకెత్తించిన బాలింత మృతి కేసులో చిక్కుముడులు వీడటంలేదు. పోలీసుల దర్యాప్తులో బాలింత బీహార్‌కు చెందిన వారని రాజమండ్రిలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రసవానికి రాజమండ్రి నుంచి తణుకు పట్టణానికి ఎందుకు వచ్చారు, పట్టణానికి చివరగా ఉంటూ ప్రసవాల్లో చివరి స్థానంలో ఉండే ఆస్పత్రినే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

ఎన్నో అనుమానాలు..

ఈనెల 16వ తేదీన తణుకులోని పైడిపర్రు ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీయడం వెంటనే బాలింత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బాలింతను ఆస్పత్రిలో చేర్చిన ఆర్‌ఎంపీ వైద్యుడు చంటి, రాజమండ్రిలో ఉండే అతని స్నేహితుడు మోషేతోపాటు మరొక మహిళ మాత్రమే శస్త్రచికిత్స చేయించడంపై తలెత్తిన అనుమానాలు నివృత్తి కాలేదు. ప్రస్తుతం మోషే పోలీసుల అదుపులో ఉండగా, మోషేతోపాటు మరొక మహిళ ఆచూకీ దొరికితేనే కానీ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. బాలింత తరపున ఎవరూ ఆస్పత్రికి రాకపోవడంతో గత మూడు రోజులుగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలోనే మృతదేహం ఉంచాల్సి వచ్చింది. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో మంగళవారం ఐసీడీఎస్‌, పోలీసుల సహకారంతో భీమవరంలోని శిశు గృహకు తరలించినట్లుగా వైద్యులు చెబుతున్నారు.

వైద్యమే లోపమా..

బాలింత మృతి ఘటనకు సంబంధించి గర్భిణి వద్ద ఎటువంటి వైద్య పరీక్షలకు చెందిన రిపోర్టులు లేకపోవడం, ఆమెకు సంబంధించిన ఆరోగ్యస్థితి హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. గర్భిణిగా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆమె గుండె పరిస్థితి ఎలా ఉంది, రక్త శాతం ఎంత ఉంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు చూసి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స ఎలా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులైన తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి కానీ, లేదంటే అన్ని విభాగాల సౌకార్యాలు ఉన్న ఏలూరు, కాకినాడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేయించి ఉంటే బాలింత బతికి ఉండేదేమోననే అంశంపై కూడా తణుకులో చర్చ జరుగుతోంది. రక్తశాతం తక్కువగా ఉన్న సమయాల్లో శస్త్రచికిత్స చేసిన వెంటనే గుండెకు సరిపడా రక్తం అందక ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయని సైతం వైద్యులు చర్చించుకుంటున్నారు.

మౌనంగా వైద్యారోగ్య శాఖ

గర్భిణులు, బాలింత, శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్నా మాతాశిశు మరణాలు జరుగుతుండడం శోచనీయం. ఈనెల 16వ తేదీన బాలింత మృతిచెందడం, 17న వెలుగులోకి రావడం, ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినా వైద్యారోగ్య శాఖ ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటనపై డీఎంహెచ్‌వో డాక్టర్‌ గీతాబాయిని వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement