ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కొలువైన సీతాదేవికి అమలాపురానికి చెందిన తాతపూడి వెంకట సాంబమూర్తి మంగళవారం రూ.25 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు కిరీటాన్ని అమ్మవారి ఉత్సవమూర్తికి అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిగాయి.
బంగారు దుకాణాలు మూసివేసి
స్వర్ణకారుల నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బంగారం కొనుగోళ్ల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు మంగళవారం బంద్‌కు దిగారు. రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఏలూరు పట్టణంలో బంగారు దుకాణాలు మూసివేసి స్వర్ణకార సంఘాల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొద్దూరి నాగభూషణం మాట్లాడుతూ ఇప్పటికే అంతంత మాత్రంగానే జీవనోపాధి కొనసాగుతోందని, తాజాగా బంగారం కొనుగోళ్లపై ప్రజల్లో అనిశ్చితి పెరగడంతో పూర్తిగా ఆర్డర్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కాసుల బంగారం పనికి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలియక వినియోగదారులు కొనుగోళ్లు మానేశారని, దీంతో తయారీ పనులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రధాని పిలుపు ఇవ్వడానికి ముందు స్వర్ణకార వర్గాలతో చర్చించి ఉండాల్సిందని విమర్శించారు. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చెబితే మా కుటుంబాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. స్వర్ణకారసంఘ ప్రధాన కార్యదర్శి చిట్టూరి త్రినాథ్ మాట్లాడుతూ స్వర్ణకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యేక ఆర్థిక నిధులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


