సాక్షి, భీమవరం: ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు చట్టప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడం పోలీసుల పనిగా ఉన్నత న్యాయస్థానం చెబుతోంది. అందుకు భిన్నంగా జిల్లాలో కొందరు పోలీసులు తెరవెనుక సెటిల్‌మెంట్లు, పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలక పక్షాల నేతల కనుసన్నల్లో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసు నమోదుకు తాత్సారం, ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బాధి తులపై ఒత్తిడి తెచ్చి కేసులు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో న్యాయం కోసం బాధితులు ఉన్నతాధికారుల తలుపు తడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఎస్పీ, ఏలూరులోని డీఐజీ కార్యాలయాలకు అందుతున్న ఫిర్యాదుల్లో స్థానిక పోలీస్ అధికారుల అవినీతి వ్యవహారాలపై అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
ఏసీబీ వలలో.. జిల్లాలోని కొందరి అవినీతి ఏసీబీ గడపకు చేరుతోంది. రెండు నెలల క్రితం చీటింగ్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయకుండా ఉండేందుకు బాధితుల నుంచి రూ.25 వేలు తీసుకుంటూ తణుకులో ఒక హెచ్‌సీ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో స్టేషన్ లోని మరికొందరి పాత్రపైనా అప్పట్లో ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు విషయమై పోలీసులు యువకుడిని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు రూ.70 వేలు చెల్లించేందుకు పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సై, కానిస్టేబుల్ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు.
క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా..
విధి నిర్వహణలో అలసత్వం, ఆరోపణలు తదితర కారణాలతో నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై ఉన్నతా ధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జనవరిలో తణుకు సర్కిల్‌లోని సీఐ, ఎస్సైను లీవ్‌పై పంప గా, ఫిబ్రవరిలో మరో సీఐ, ఎస్సైను రేంజ్ వీఆర్‌కు పంపారు. నెలరోజుల క్రితం ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న సీఐ తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం యలమంచిలి ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేయగా, ఉండి ఎస్సైను వీఆర్‌కు పంపారు. క్రమశిక్షణ చర్యలు ఏ మేరకు మార్పు తీసుకువస్తున్నాయనేది ప్రశ్నార్థకమే. తాజా ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు న్యాయం అందించే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
బాలికపై లైంగిక దాడి కేసులో ఇటీవల భీమవరం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అని ప్రశ్నించింది. అధికార పక్షానికి చెందిన నిందితులను కాపాడేందుకు కేసు వాపసు తీసుకొమ్మని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నట్టు బాలిక తల్లి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.
తన కుమారుడి మరణానికి ఆకివీడు పోలీసులు కారణమని తల్లి ఆరోపిస్తోంది. కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసుపై ఈనెల 10న పోలీసులు తన కుమారుడిని స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురిచేయడంతో నొప్పులు తట్టుకోలేక 11న ఆత్మహత్య చేసుకున్నట్టు బోరుమంది. తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిసే ప్రయత్నం చేయగా స్థానిక పోలీసులు అడ్డంకులు కల్పించడంతో ఏలూరులో డీఐజీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు డీఐజీ ఆదేశించారు.
నరసాపురం రూరల్‌లో జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ బాలిక పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను కూడా లైంగికంగా వేధిస్తున్నట్టు పేర్కొంది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. పోక్సో కేసు నమోదుకు ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు.
పోలీసుల చెరలో న్యాయం
సెటిల్‌మెంట్లు, పైరవీల్లో పోలీసులు
కూటమి నేతల సేవలో తరిస్తున్న లోకల్ బాస్‌లు
కేసుల నమోదుకు తాత్సారం
బాధితులపై ఒత్తిడి తెచ్చి నీరుగార్చే ప్రయత్నాలు
న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న బాధితులు


