రైతుల సమస్యలు పట్టని మంత్రి కొలుసు | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పట్టని మంత్రి కొలుసు

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

రైతుల సమస్యలు పట్టని మంత్రి కొలుసు

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు మండిపాటు

నూజివీడు: గిట్టబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి, మొక్కజొన్న రైతులను ఆదుకుందామనే ఆలోచనే నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొలుసు పార్థసారథికి లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తీవ్రంగా విమర్శించారు. నూజివీడులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారం గురించి మంత్రి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, సొంత పార్టీ వారే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. రైతులను ఆదుకోవాలని అడుగుతుంటే దానిని పక్కదారి పట్టించాలని చూడటం గర్హనీయమన్నా రు. నియోజకవర్గంలో 12 వేల ఎకరాల్లో వాణిజ్య మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారన్నారు. ఎకరాకు రూ.28 వేల వరకు నష్టం వాటిల్లుతోందని, ఇలా నియోజకవర్గంలో రూ.33.60 కోట్లు నష్టపోయారన్నారు. నష్టపోతున్న రైతులను ఆదుకోవాలనే ఆలోచనే మంత్రికి లేదని, రెండు నెలల క్రితం మాట్లాడానని చెబుతున్న మంత్రి ఇప్పటికీ రైతులకు ఒక్క రూపాయి పరిహారం ఇప్పించారా, ఒక్క కొనుగోలు కేంద్రమైనా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కేంద్రానికి లేఖ రాసి మంత్రి ఏం సాధించారో చెప్పాలన్నారు.

రైతుల సమస్యలపై మాట్లాడితే సొల్లు మాట్లాడినట్లా..

రైతుల సమస్యలపై మాట్లాడితే మంత్రికి సొల్లు మాట్లాడినట్టుగా ఉందా అని ప్రతాప్‌ అప్పారావు నిలదీశారు. నియోజకవర్గంలోని మామిడి, మొక్కజొన్న రైతులకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. అలాగే రెండేళ్లలో నూజివీడుకు చేసింది ఏమిటో చెప్పాలన్నారు. మామిడికి కేరాఫ్‌ అడ్రస్‌ నూజివీడు అని అలాంటి మామిడిని, మామిడి రైతులను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. నూజివీడు మామిడిని, మామిడి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కడి నుంచో వచ్చిన మంత్రికి లేకపోయినా స్థానికులమైన తమపై ఉందన్నారు. నూజివీడు అభివృద్ధి అంతా దివంగత వైఎస్సార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల హయాంలోనే జరిగిందన్నారు. తమ హ యాంలో టీటీడీ లెటర్లను నియోజకవర్గ ప్రజలకు పిలిచి ఉచితంగా ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం లెటర్లను కొనుక్కోవాల్సి వస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. పీజీ కేంద్రంలో రూ.6 కోట్లతో అకడమిక్‌ భవనాన్ని నిర్మిస్తే ప్రారంభించడమే మంత్రికి చేతకావడం లేదన్నారు. మంత్రికి కావాల్సింది చెరువులు, కొండల మట్టి తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కాదని మండిపడ్డారు. ట్రిపుల్‌ఐటీ గో డను ఆనుకుని ఏడు ఎకరాల సీలింగ్‌ భూమి ఉందని, దానిని పేదలకు పంచాలని హైకోర్టు బెంచ్‌కు వెళ్లనున్నట్టు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement