తణుకు అర్బన్: తణుకులో శిశువును ప్రసవించిన కొద్దిసేపటికే తల్లి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్టార్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ వ్యవహారం గందరగోళంగా మారింది. అసలు ఆమె ఎవరు.. ఏ ఊరు.. ఏంటనే వివరాలు లేకుండా అప్పటికప్పుడు ప్రసవానికి రావడం, కండీషన్‌ను బట్టి వెంటనే శస్త్రచికిత్స చేయడం, ఆమె చనిపోవడం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 17న రాత్రి తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి బాలింత మృతదేహాన్ని తీసుకురాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. ఆమె తరఫున ఏ ఒక్కరూ రాకపోవడం అను మానాలకు తావివ్వడంతో తణుకు రూరల్ పోలీసులు రంగప్రవేశం చేశారు. పిల్లల విక్రయాలకు సంబంధించిన వ్యవహారంగా అనుమానాలు రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
అనుమానాలెన్నో..
తణుకులో ఓ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా, బయట ఆర్‌ఎంపీగా చలామణి అవుతున్న పెనుమాక డేవిడ్ చంటి తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ గర్భిణిని ఈనెల 16న పట్టణంలోని స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆస్పత్రి వైద్యుడు కనీసం ఆమె వివరాలు ఏమీ తెలుసుకోకుండా, ఎలాంటి రిపోర్టులు లేకుండానే సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. కొద్దిసేపటికే ఆమె మృతిచెందడంతో మృతదేహాన్ని చంటి, రాజమండ్రికి చెందిన అతడి సన్నిహితుడు బిక్కవోలు మోషే కలిసి దువ్వ వెంకయ్య వయ్యేరు వద్దకు తీసికెళ్లినట్టు సమాచారం. తిరిగి అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఈనెల 17న సాయంత్రం తణుకు ప్రభుత్వాస్పత్రికి చేర్చి వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలింత వేరే రాష్ట్రానికి చెందిన మహిళకాగా ఆస్పత్రిలో చేర్చే సమయంలో మోషేతో పాటు మరో మహిళ కూడా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు వచ్చేలోపు మోషేతో పాటు ఆ మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. గర్భిణి పేరు కుమారి అని తనకు మోషే అప్పగించాడని చంటి చెబుతున్నాడు. వివరాలు తెలియకుండా ఆపరేషన్ ఎలా చేశారని వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుని అడగ్గా ఎమర్జెన్సీ అని చెప్పడంతోనే సిజేరియన్ చేసినట్టు చెప్పారు.
పసిపిల్లల విక్రయాల్లో భాగమేనా..?
చంటి గతంలోనూ ఇదే తరహాలో కొందరికి సిజేరియన్లు చేయించి శిశువులను విక్రయించేవాడనే ఆ రోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో గర్భిణికి ఆపరేషన్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. చంటిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మోషే ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తణుకు రూరల్ ఇన్‌చార్జి ఎస్సై జానా సతీష్ తెలిపారు. 16న బాలింత మృతిచెందగా సుమారు 24 గంటలపాటు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు, ఏం చేయాలనుకున్నారనేది అనుమానాస్పదంగా ఉంది. ఇదిలా ఉండగా చంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. శిశువును వీరభద్రపురంలో ఒక ఇంట్లో ఉంచారనే సమాచారంతో పోలీసులు శిశువును తీసుకువచ్చి ప్ర భుత్వాస్పత్రిలో చేర్చారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణకుమారి, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి శిశువును సో మవారం పరిశీలించారు. శిశు గృహ సెంటర్‌కు తరలిస్తామని వారు చెప్పారు.
వివరాలు తెలియకుండాశస్త్రచికిత్స చేసిన డాక్టర్
ఆస్పత్రిలో చేర్పించిన ఆర్‌ఎంపీ
గందరగోళంగా బాలింత మృతి వ్యవహారం
శిశువుల విక్రయాల్లో భాగమా అనే అనుమానాలు


