కొయ్యలగూడెం: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.22 లక్షల విరాళాన్ని సేకరించి సోమవారం అందించారు. బయ్యన్నగూడేనికి చెందిన సింగంశెట్టి మణికంఠ అనే బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా ఈనెల 10న ‘సాక్షి’లో ‘సాయం కోసం ఎదురుచూపులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అలాగే గ్రామ యు వత సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వైద్యానికి అవసరమైన రూ.22 లక్షలు సేకరించి గ్రామ పెద్దల సమక్షంలో బాలుడి కుటుంబానికి అందజేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు సోమవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో పరీక్షలకు 459 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం 120 మందికి 117 మంది, ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 169 మంది, మధ్యాహ్నం 180 మందికి 173 మంది హాజరయ్యారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా 246 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. ప్రతి వినతిని సంబంధిత అధికారు లు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపు సత్వర పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతిచెందిన వి.మాధవరెడ్డి భార్య సుజాతకు ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం నుంచి ఆర్థిక సాయం అందించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ చేతులమీదుగా రూ.లక్ష చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామనీ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇప్పటికే మాధవరెడ్డి కుటుంబానికి ప్లాగ్ ఫండ్ రూ.25 వేలు, విడో ఫండ్ రూ.50 వేలు అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలను వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో వచ్చేనెల 5న రైతు సదస్సు, నూతన సాంకేతిక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు వీసీ కట్టుపల్లి ధనుంజయరావు తెలిపారు. సుస్థిర ఉద్యానం, సుభిక్ష ఫలసాయం ప్రధానాంశంగా ఉద్యాన పంటల్లో ఆధునిక సాగు పద్ధతులు పరిచయం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తామన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని జిల్లాలోని భీమవరం, వీరవాసరం మండలాల్లోని అక్రమ లేఅవుట్లను అధికారులు పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు. భీమవరం మండలంలోని విలీన గ్రామాలుగా ఉన్న తాడేరులో నాలుగు, కొమరాడలో మూడు, కొవ్వాడ అన్నవరంలో రెండు లేఅవుట్లను ధ్వంసం చేయించారు.


