మృత్యు శకటాలుగా మట్టి ట్రాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

మృత్యు శకటాలుగా మట్టి ట్రాక్టర్లు

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

తణుకు అర్బన్‌: మట్టి ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో పయనిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాక్టర్‌ డ్రైవర్లు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతో నిత్యం పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేసవి వస్తుందంటే చాలు మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. వ్యవసాయ భూముల్లో మట్టి తోలకం కోసం పోటాపోటీగా నడస్తున్న ట్రాక్టర్లతో ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ వేసవి మొదలైన రోజు నుంచి మట్టి తోలకాలు జోరుగా సాగుతున్న నేపధ్యంలో మట్టి ట్రాక్టర్ల వేగానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకరికంటే మరొకరు అధికంగా ట్రిప్పులు వేయాలనే ఉద్దేశంతో వేగంగా నడుపుతున్న తీరు ప్రయాణికుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇందుకు నిదర్శనమే తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని బైపాస్‌ రోడ్డులో ఒక అమాయక ప్రాణం బలిగొంది. ఈనెల 17వ తేదీన బైపాస్‌ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాలకోడేరు మండలం అన్నాకోడేరు గ్రామానికి చెందిన పులగం బాలాజీ, భవాని దంపతులను ట్రాక్టరు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో భవాని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే ట్రాక్టరు సైతం సమీపంలోని పొలాల్లోకి దూసుకువెళ్లిన తీరు వాహన వేగాన్ని తెలుపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ట్రాక్టరు డ్రైవరు కూడా మైనరుగా ఉన్నాడని, విపరీతమైన సౌండ్‌తో పాటలు పెట్టుకుని వేగంగా వచ్చాడని ప్రయాణికులు చెబుతున్నారు. నిర్లక్ష్యం, వేగం, నిబంధనలు పాటించని వైనానికి ఒక నిండు ప్రాణం బలైంది. గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మృత్యుశకటాలుగా..

తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ భూముల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తవ్వడం ఒకటైతే, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న వేగం ప్రయాణికులను భయపెడుతోంది. ముఖ్యంగా ట్రాక్టరు డ్రైవర్లు అధికశాతం మైనర్లే ఉంటున్నారని, ట్రాక్టరుకు నిబంధనలకు విరుద్ధంగా భారీ సౌండ్‌ బాక్స్‌లు ఏర్పాటుచేసుకుని విపరీతమైన సౌండ్స్‌తో ప్రయాణిస్తున్నారని ఆయా గ్రామాల్లోని నివాసితులు చెబుతున్నారు. గ్రామాల్లోని రోడ్లపై వేగంగా వెళ్తున్న తీరు చూస్తుంటే పిల్లలను రోడ్డుపైకి వదలాలంటేనే భయమేస్తుందని పలువురు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ట్రాక్టర్లకు నంబరు ప్లేట్లు కూడా ఉండడంలేదని, కొన్నింటికి ఉన్నప్పటకీ విపరీతమైన అలంకరణతో ఆ నంబరు ప్లేట్లు కనిపించని పరిస్థితిలో ఉంటున్నాయి. అయితే అధికారులు ఈ తరహా వాహనాలను నిలువరించినా రాజకీయ ఒత్తిడిలు, సిఫార్సులతో చర్యలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

మితిమీరిన వేగంతో పయనం

పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వైనం

ఇటీవల మట్టి ట్రాక్టరు ఢీకొని మహిళ మృతి

నిబంధనలు పాటించని ట్రాక్టర్ల డ్రైవర్లు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement